-అధికారుల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి: కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ (పంపిణీ), రిసెప్షన్ (స్వీకరణ) కేంద్రాల నిర్వహణ అత్యంత కీలకమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ అథారిటీ కె. మయూర్ అశోక్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో విధులు కేటాయించిన సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి అధికారి, సిబ్బంది సమన్వయంతో, పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, స్టాట్యూటరీ, నాన్-స్టాట్యూటరీ మెటీరియల్తో కూడిన బ్యాగులను రూట్, జోనల్ అధికారులు ముందుగానే క్షుణ్ణంగా పరిశీలించి, రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పంపిణీ చేయాలని సూచించారు.
పోలింగ్ సిబ్బందికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఓటర్ల జాబితాలు, చెరగని సిరా, ఇతర స్టేషనరీ సామగ్రిని ఎలాంటి జాప్యం లేకుండా అందించేందుకు ప్రత్యేక కౌంటర్లతో ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ అధికారులు తమకు కేటాయించిన సామగ్రి, బ్యాలెట్ బాక్సులను డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే రెండుసార్లు తనిఖీ చేసుకోవాలని సూచించారు.
బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో ప్రయాణించే సిబ్బందికి పటిష్టమైన పోలీసు భద్రత కల్పించనున్నట్లు తెలిపారు. రవాణా వాహనాలను జీపీఎస్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. రూట్, జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల పంపిణీ, సిబ్బంది హాజరును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
రిసెప్షన్ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు
పోలింగ్ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి వచ్చే రిసెప్షన్ కేంద్రాల వద్ద రద్దీ, గందరగోళం తలెత్తకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులు, ఫారాలు, ఇతర ఎన్నికల రికార్డులను వేగంగా స్వీకరించి, పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పటిష్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచి సీల్ చేస్తామని వెల్లడించారు.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ ప్రక్రియలను మూడు నుంచి నాలుగు గంటల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విధుల్లో పాల్గొనే సిబ్బందికి తాగునీరు, అల్పాహారం, వైద్య సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది నిర్దేశిత సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకుని, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ మయూర్ అశోక్ సూచించారు. అందరి సమన్వయం, క్రమశిక్షణతో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
