-ఈటీవీ రిపోర్టర్ సుందర్ పై దాడిని తీవ్రంగా ఖండించిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం
కడప, నేటి పత్రిక ప్రజావార్త:
జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని ఆయన అన్నారు. కడప జిల్లాలో ఈటీవీ రిపోర్టర్ సుందర్ పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. పాత్రికేయులకు రక్షణ కల్పించడంతో పాటు, బాధిత జర్నలిస్టుకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబు విజ్ఞప్తి చేశారు.
