-1.78 ఎకరాల భూమి కేటాయింపు.. లీజు ఒప్పందం పూర్తి
-నేలపాడులో కార్యాలయం, డేటా సెంటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఏర్పాటు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారాజధాని అమరావతిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించిన లీజు ఒప్పంద ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సెబీ కార్యాలయ ఏర్పాటుకు APCRDA అమరావతిలోని నేలపాడు వద్ద 1.78 ఎకరాల భూమిని కేటాయించింది.
ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 20, 2026) జరిగిన కార్యక్రమంలో APCRDA ఎస్టేట్స్ విభాగం జాయింట్ డైరెక్టర్ జుబిన్ రాయ్, సెబీ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.వి.ఎన్. సూర్యకుమార్‌కు లీజు ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
అమరావతిలో సెబీ స్థానిక కార్యాలయంతో పాటు అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో కూడిన డేటా సెంటర్, ప్రాంతీయ శిక్షణ కేంద్రం, నాయకత్వ అభివృద్ధి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రంలో శిక్షణ తరగతులు, ఆడిటోరియం, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (MDP) నిర్వహించనున్నట్లు సెబీ అధికారులు వెల్లడించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM) సహకారంతో పరీక్షా కేంద్రాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సెబీ కార్యాలయం, డేటా సెంటర్, శిక్షణ, నాయకత్వ అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా అమరావతిలో ఆర్థిక సేవలు, వృత్తి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ రంగాల్లో కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ స్థాయి సంస్థలకు అమరావతి వేదికగా మారుతున్న నేపథ్యంలో సెబీ కార్యాలయ ఏర్పాటుకు లీజు ఒప్పందం పూర్తికావడం రాజధాని అభివృద్ధిలో మరో కీలక ముందడుగుగా నిలవనుంది.
