ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారం రోజులపాటు ఠాగూర్ స్మారక గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్య అతిథి డాక్టర్ ఎన్. సుకుమార్, ఎస్.ఆర్.ఆర్. కళాశాల ఆర్థికశాస్త్ర విభాగాధిపతి, విశిష్ట అతిథి వి. కేశవరావు, విద్యార్థి వికాస వాహిని అధినేత, ఆత్మీయ అతిథి కె. చంద్రిక (యూపీఎస్సీ, సీఏ ఫ్యాకల్టీ, బ్రైట్ మైండ్స్ అధినేత్రి), శ్రీముఖి స్వాతి పూర్ణిమ, ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారి కె. రమాదేవి బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభాపాటవాలను, సృజనాత్మకతను వెలికితీసేందుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు.
సభ ప్రారంభానికి ముందు ముఖ్య అతిథి డాక్టర్ ఎన్. సుకుమార్ ఠాగూర్ స్మారక గ్రంథాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థినీ విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ బహుమతులు పొందిన విద్యార్థులను అభినందిస్తూ గ్రంథాలయాల ప్రాముఖ్యతను వివరించారు.
ఆత్మీయ అతిథి కె. చంద్రిక మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల, వినయం ఉంటే సమాజంలో సాధించలేనిది ఏదీ లేదన్నారు. పుస్తకాలే మనకు మంచి స్నేహితులని, స్మార్ట్‌ఫోన్లను అవసరమైనప్పుడే వినియోగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.
శ్రీముఖి స్వాతి పూర్ణిమ మాట్లాడుతూ వివిధ పోటీల్లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభాపాటవాలు, వారి ప్రదర్శన ఎంతో అమోఘంగా ఉన్నాయని ప్రశంసించారు.
ఠాగూర్ స్మారక గ్రంథాలయ అధికారి కె. రమాదేవి మాట్లాడుతూ వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు, వివిధ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులకు, సహకరించిన తల్లిదండ్రులకు, కార్యక్రమాల విజయవంతానికి సేవలందించిన ప్రతి ఒక్కరికీ, గ్రంథాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి ఆదివారం నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని, వివిధ అంశాల్లో శిక్షణ పొందుతూ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే బహుమతులతోపాటు వారి విజ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందించే విలువైన పుస్తకాలను కూడా అందజేశారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ ముగింపు వేడుకలు విజయవంతంగా ముగిశాయి.