-శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయంలో బిల్వార్చన, ఆకాశదీపం, సహస్ర లింగార్చన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిల్వార్చన, ఆకాశదీపం, సహస్ర లింగార్చన, సహస్ర దీపాలంకరణ, ఊయల సేవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానాచార్యులు వి. శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా క్రతువులు జరిపించారు.
ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు పద్మావతి ఠాకూర్, సరిత తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక పూజలు, సహస్ర దీపాలంకరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
