-శనివారం కూడా కొనసాగనున్న మేళా – సిటీ ప్లానర్ డి. రాంబాబు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాకు శుక్రవారం విశేష స్పందన లభించింది. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ మేళా శనివారం కూడా కొనసాగనుందని సిటీ ప్లానర్ డి. రాంబాబు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటున్నారని పేర్కొన్నారు.
శుక్రవారం నిర్వహించిన మేళాకు 155 మంది దరఖాస్తుదారులు హాజరై తమ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ముందుకు వచ్చారని తెలిపారు. ఇంజినీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వెల్లడించారు.
శనివారం జరిగే మేళాలో సంబంధిత ఫీజులు చెల్లించాల్సిన వారు, దరఖాస్తుల పరిశీలనలో భాగంగా షార్ట్‌ఫాల్ ఎండార్స్‌మెంట్లు జారీ చేయబడిన వారు, అవసరమైన అదనపు పత్రాలు సమర్పించాల్సిన వారు హాజరుకావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించుకోవాలని కోరారు.
దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలు, ఫీజు చెల్లింపు రసీదులతో మేళాకు హాజరై తమ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సిటీ ప్లానర్ డి. రాంబాబు విజ్ఞప్తి చేశారు
