-పరిశుభ్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులు – సుమారు 50 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్వాధీనం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు గారి ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ శ్రీనివాస్, ప్రజారోగ్య అధికారులు మరియు సిబ్బందితో నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, జ్యూస్ స్టాళ్లలో పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై ప్రజారోగ్య విభాగం అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పండిట్ నెహ్రూ బస్టాండ్‌లోని శ్రీ బాలాజీ షిర్డీ హోటల్, శ్రీ బాలాజీ షిర్డీ మిలటరీ హోటల్ మరియు జ్యూస్ స్టాల్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో గోడలు, ఇతర ప్రదేశాల్లో బూజు ఏర్పడటం, అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార తయారీ, నాణ్యమైన తాగునీటిని వినియోగించకపోవడం, మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వంటగది తలుపులకు ఈగలు, కీటకాలు ప్రవేశించకుండా తగిన రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా వంటగది నుంచి వెలువడే మురుగునీరు, ఇతర వ్యర్థ జలాలను సైడ్ డ్రైన్లలోకి వదలడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించడం, రిఫ్రిజిరేటర్లను పరిశుభ్రంగా నిర్వహించకపోవడం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు తగిన డస్ట్బిన్లు ఏర్పాటు చేయకపోవడం, త్రాగునీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా లేకపోవడం, శుద్ధి చేసిన త్రాగునీటిని వినియోగించకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు.
జ్యూస్ స్టాళ్లలో తనిఖీల సందర్భంగా గడువు ముగిసిన పాల ప్యాకెట్లను వినియోగించడం, జ్యూస్ తయారీ కోసం పండ్లను ముందుగానే అధిక మొత్తంలో కట్ చేసి డీప్ ఫ్రీజర్‌లో నిల్వ చేయడం వల్ల అవి కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, జ్యూస్ తయారీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం, జ్యూస్ తయారీకి ఉపయోగించే ఐస్‌ను పరిశుభ్రమైన, తగిన పాత్రల్లో నిల్వ చేయకపోవడం వంటి లోపాలను గుర్తించారు. అంతేకాకుండా హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి వారి ఆరోగ్య స్థితిని నిర్ధారించే చెల్లుబాటు అయ్యే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడాన్ని కూడా గుర్తించారు. ఈ తనిఖీల సందర్భంగా నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను సుమారు 50 కిలోల మేర స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా జ్యూస్ స్టాళ్లలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన సపోటా పండ్ల గుజ్జును గుర్తించి స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం ధ్వంసం చేయడం జరిగింది. గడువు ముగిసిన పాల ప్యాకెట్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది.
తనిఖీల్లో గుర్తించిన లోపాలపై సంబంధిత హోటల్, జ్యూస్ స్టాల్ యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోగా గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో సరిదిద్దుకొని, పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. గడువులోగా లోపాలను సరిచేయని యాజమాన్యాలపై చట్టప్రకారం తదుపరి చర్యలు చేపట్టడంతో పాటు, అవసరమైతే ట్రేడ్ లైసెన్సులను రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించే బాధ్యతను ప్రతి హోటల్, రెస్టారెంట్ మరియు జ్యూస్ స్టాల్ యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. ఈ తనిఖీలలో శానిటరీ సూపర్వైజర్లు డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బి. యోగేంద్ర కుమార్, కె. కృష్ణ, జి. శ్రీనివాసరావు, కె. గోపయ్య మరియు ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
