-70 స్టాళ్లను సందర్శించి చేనేత కార్మికులు, కళాకారులతో మాట్లాడిన నారా బ్రాహ్మణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతీయ చేనేత, హస్తకళలు, సంప్రదాయ కళా వైభవాన్ని చాటిచెప్పే లక్ష్యంతో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (CCAP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వసంతం’ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారా బ్రాహ్మణి హాజరై ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన మొత్తం 70 స్టాళ్లను ఆమె స్వయంగా సందర్శించారు. చేనేత కార్మికులు, హస్తకళాకారులతో మాట్లాడి వారు తయారుచేసిన ఉత్పత్తులు, వాటి ప్రత్యేకతలు, తయారీలో ఉపయోగించే నైపుణ్యాల గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వాహకులను ఆమె అభినందించారు. చేనేత కార్మికులు, కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు పరిచయం చేసుకోవడానికి, మార్కెట్ అవకాశాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భారతదేశ సంప్రదాయ కళలు, చేనేత వారసత్వాన్ని కాపాడటంతో పాటు కళాకారులకు ప్రోత్సాహం అందించడంలో ‘వసంతం’ వంటి ప్రదర్శనలు కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చేనేత, హస్తకళా రంగాలను ప్రోత్సహించడం, కళాకారులకు నేరుగా మార్కెట్ అవకాశాలు కల్పించడం, వారి ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా CCAP చేపట్టిన ఈ కార్యక్రమం ప్రశంసనీయమని తెలిపారు.
‘వసంతం’ ఎగ్జిబిషన్ రేపు (నవంబర్ 3) కూడా కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శేషసాయి కల్యాణ మండపం, వేదికలో సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. చేనేత వస్త్రాలు, హస్తకళా ఉత్పత్తులను వీక్షించి, కళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనను సందర్శించాలని నిర్వాహకులు కోరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత కార్మికులు, హస్తకళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
