75,350 సదరం స్లాట్లు విడుదల

-తొలిరోజే 60.56 శాతం బుకింగ్‌లు పూర్తి
-వినికిడి లోపం స్లాట్లలో 88.92 శాతo పూర్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి సదరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు విడుదల చేసిన 75,350 స్లాట్ల బుకింగ్‌లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజే 45,631 స్లాట్లు బుక్‌ అయ్యాయి. మొత్తం స్లాట్లలో 60.56 శాతం బుకింగ్‌లు పూర్తికాగా, ఇంకా 29,719 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. దివ్యాంగత్వ రకాల వారీగా వినికిడి లోపానికి 7,718 (88.92 శాతం), మానసిక అనారోగ్యానికి 2,545 (78.55 శాతం), కదలికల వైకల్యానికి 21,802 (72.91 శాతం), అంధత్వానికి 2,008 (69.72 శాతం), తక్కువ చూపునకు 3,679 (42.57 శాతం) స్లాట్లు బుక్‌ అయ్యాయి.

అత్యల్పంగా బుకింగ్‌లు

యాసిడ్‌ దాడి బాధితులకు 102 (7.97 శాతం), హీమోఫీలియాకు 139 (10.86 శాతం), కుష్ఠు వ్యాధి నయమైన వారికి 143 (11.17 శాతం), తలసేమియాకు 152 (11.88 శాతం), నిర్దిష్ట అభ్యసన వైకల్యానికి 155 (12.92 శాతం) స్లాట్లు బుక్‌ అయ్యాయి.

అత్యధిక స్లాట్లు జిల్లాలు

జిల్లాల వారీగా అందుబాటులో ఉన్న స్లాట్లలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 2,868, విజయనగరంలో 2,754, శ్రీకాకుళంలో 2,677, కృష్ణా జిల్లాలో 2,606, విశాఖపట్నంలో 2,187 స్లాట్లు ఉన్నాయి.

అత్యల్ప స్లాట్లు అందుబాటులో ఉన్న జిల్లాలు

బాపట్ల, పల్నాడు జిల్లాల్లో స్లాట్లు పూర్తిగా బుక్‌ అయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో 3, మార్కాపురం జిల్లాలో 108, అనంతపురం జిల్లాలో 131 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

తుపాను నేపథ్యంలో ప్రత్యేక వెసులుబాటు

మురసు తుపాను ప్రభావం కారణంగా నవంబర్‌ 3, 6 తేదీల్లో నిర్వహించనున్న సదరం దివ్యాంగుల అంచనా శిబిరాలకు స్లాట్‌ బుక్‌ చేసుకున్న కొంతమంది హాజరుకాలేకపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఆయా తేదీల్లో తుపాను కారణంగా శిబిరాలకు హాజరుకాలేని దివ్యాంగులు ఆరు నెలల్లోపు ఎప్పుడైనా సంబంధిత ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు.
ఆసుపత్రికి వచ్చే అర్హులైన దివ్యాంగులను వెనక్కి పంపకుండా, అదే రోజు వైద్య పరీక్షలు నిర్వహించాలని సంబంధిత ఆసుపత్రులకు సూచనలు జారీ చేశారు. తుపాను సమయంలో ప్రయాణ ఇబ్బందులు పడకుండా, తమ సౌకర్యాన్ని బట్టి తర్వాత పరీక్షలకు హాజరుకావాలని ప్రభుత్వం దివ్యాంగులకు విజ్ఞప్తి చేసింది.