ప్రపంచ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో వైశాలికి కాంస్య పతకం

-విజయవాడకు చేరుకున్న క్రీడాకారిణికి SAAP ఆధ్వర్యంలో ఘన స్వాగతం.. సన్మానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
చైనాలోని జింగ్హాన్‌లో అక్టోబర్ 26 నుంచి 31 వరకు నిర్వహించిన ప్రపంచ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో విజయవాడకు చెందిన సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారిణి ఏ.ఎస్. వైశాలి అద్భుత ప్రతిభ కనబరిచి డబుల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తీసుకొచ్చిన వైశాలి నవంబర్ 2న విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) ఆధ్వర్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో SAAP PRO విభాగం సిబ్బందితో పాటు ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కాకర్ల కోటేశ్వరరావు, SAAP ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైశాలి సాధించిన విజయాన్ని అభినందిస్తూ ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైశాలి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని అధికారులు ఆకాంక్షించారు. ప్రపంచ స్థాయి పోటీల్లో పతకం సాధించడం ద్వారా విజయవాడ క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచిన వైశాలికి పలువురు అభినందనలు తెలిపారు.