-ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం..
-గంపలగూడెం జడ్పీటీసీ కేటాయింపులో సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాం: ఎంపీ కేశినేని చిన్ని
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ఏ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు రూరల్, విస్సన్నపేట మండలాల్లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విస్తృతంగా పర్యటించారు. ఆయా మండలాల్లో కూటమి తరఫున పోటీ చేస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులతో సమావేశమై ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గంపలగూడెం జడ్పీటీసీ అభ్యర్థి పుల్లమ్మకు టికెట్ కేటాయింపు, సామాజిక న్యాయం, పార్టీ పట్ల అంకితభావం, స్థానిక నాయకుల త్యాగాలు, ఎన్నికల సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఎంపీ కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు.
సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ పుల్లమ్మకు జడ్పీటీసీ
గంపలగూడెం జడ్పీటీసీ టికెట్ కేటాయింపులో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచి, పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన పుల్లమ్మ కుటుంబానికి అధిష్ఠానం తగిన గుర్తింపు ఇచ్చిందన్నారు.ఉద్యోగాన్ని సైతం వదులుకుని పార్టీ కోసం పనిచేసిన పుల్లమ్మ కుటుంబ సేవలను గుర్తించి జడ్పీటీసీ టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. టికెట్ కోసం పలువురు నాయకులు పోటీపడినప్పటికీ, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్థానిక నాయకులు త్యాగం చేసి పుల్లమ్మకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడమే తమ విధానమని, టికెట్ల కేటాయింపులో వ్యక్తిగత ప్రాధాన్యతలకు కాకుండా పార్టీ పట్ల అంకితభావం, ప్రజాదరణ, సర్వే ఫలితాలకు ప్రాధాన్యత ఇచ్చామని ఎంపీ చిన్ని వివరించారు.
ఐవీఆర్ఎస్ సర్వేలో పుల్లమ్మకు 64 శాతం మద్దతు
గంపలగూడెం జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికలో నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో పుల్లమ్మకు 64 శాతం మద్దతు లభించిందని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.పార్టీ పట్ల అంకితభావం, ప్రజల్లో ఉన్న ఆదరణ, క్షేత్రస్థాయిలో నాయకుల అభిప్రాయాలు, సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుని టికెట్ల కేటాయింపు చేపట్టామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలన్నదే అధిష్ఠానం ఉద్దేశమని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే జడ్పిటిసి ఇచ్చారన్న ప్రచారంపై ఎంపీ స్పందన
గంపలగూడెం జడ్పీటీసీ కేటాయింపు విషయంలో ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే పుల్లమ్మకు అవకాశం ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు.ఎమ్మెల్యే, ఎంపీ మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలు సహజమని, వాటిని పెద్దవిగా చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీ ప్రయోజనాలు, అధిష్ఠానం నిర్ణయమే ముఖ్యమని అన్నారు.ఎన్నికల సమయంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని, కూటమి అభ్యర్థుల విజయమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నా అధిష్ఠానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు.వ్యక్తుల కంటే పార్టీ నిర్ణయమే ముఖ్యమని, పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతామని ఎంపీ చిన్ని తెలిపారు.
లోకేశ్ నాయకత్వంలో కార్యకర్తలకు తగిన గుర్తింపు
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు లోకేశ్ నాయకత్వంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు.పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల సేవలను అధిష్ఠానం గుర్తిస్తుందని తెలిపారు. టికెట్ల కేటాయింపులో పార్టీ పట్ల అంకితభావం, ప్రజాదరణ, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
కూటమిలో సమన్వయానికి ఎలాంటి ఇబ్బందులు లేవు
కూటమి పార్టీల మధ్య సమన్వయానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఎంపీ కేశినేని చిన్ని స్పష్టం చేశారు. అన్ని పార్టీల నాయకులు పరస్పర సహకారంతో పనిచేస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.ఏ.కొండూరు, గంపలగూడెం, తిరువూరు రూరల్, విస్సన్నపేట మండలాల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగుతామని, పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ధీమా వ్యక్తం చేశారు.
