గొల్లపూడిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశం

-కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలి: ఎంపీ కేశినేని చిన్ని

గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ రూరల్ మండలం, మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఆత్మీయ సమావేశం గొల్లపూడిలోని పద్మావతి కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, సీనియర్ నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. కూటమి నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతో పాటు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

విజయవాడ రూరల్ మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా నూతలపాటి బాల కోటేశ్వరరావు (బాల)ను తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులు బలపరిచారు. కూటమి అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేస్తూ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది. విజయవాడ రూరల్ మండలంలో కూటమి బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పాన్ని ఈ ఆత్మీయ సమావేశం చాటిచెప్పింది.