ఓటమి భయంతోనే జగన్‌ గగ్గోలు.. ప్రజాస్వామ్యంపై నిందలు!

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ధ్వజం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా సాగిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. పులివెందులలోనూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జిల్లా కలెక్టర్‌, ఎస్పీ స్పష్టం చేసినప్పటికీ, ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కడతారనే భయంతో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాలంటూ ఆరోపణలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఏజెంట్లను అనుమతించలేదంటూ ఆందోళన చేయడం, రీపోలింగ్‌ కోరడం ఆయన ఓటమి భయానికి నిదర్శనమన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలపై బురదజల్లడం తగదని హితవు పలికారు.

పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను అనుమతించలేదన్న జగన్‌ ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి పేర్కొన్నారు. ప్రజల తీర్పును అంగీకరించలేక రీపోలింగ్‌ జరపాలంటూ జగన్‌ డిమాండ్‌ చేయడం ఆయన రాజకీయ అసహనాన్ని తెలియజేస్తోందని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ప్రజలేనని, వారి తీర్పును గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని స్పష్టం చేశారు.