వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జీవనశైలి వారోత్సవాల నిర్వ‌హ‌ణ‌

-1 నుంచి 7 వరకు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నవంబర్‌ 1 నుంచి 7 వరకు ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా జరగనున్నాయి. ఈ క్ర‌మంలోనే వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, నీరు, విద్యుత్తు పొదుపు, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు, ఆసుపత్రుల పరిశుభ్రత, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై అవగాహన కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి.

సుస్థిర జీవనశైలి అంటే..

బ్రిక్స్‌ అనేది బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాల మధ్య సహకారానికి ఏర్పడిన అంతర్జాతీయ వేదిక. 2026లో బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ నిర్వహిస్తోంది. ఈ ఏడాది పర్యావరణ అంశాల్లో భాగంగా సుస్థిర జీవనశైలిని ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను తగ్గించడం, తిరిగి వినియోగాన్ని పెంచడం, పర్యావరణ హిత అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఆరోగ్యం, పర్యావరణం పరస్పరం విడదీయలేని అంశాలనే విషయాన్ని ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌ శాఖ కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు తెలిపారు.

ఆసుపత్రుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లకు ప్రోత్సాహం

– నవంబర్‌ 1: వారోత్సవాల ప్రారంభం. రెండు కిలోమీటర్ల నడక, యోగా, వ్యాయామ కార్యక్రమాలు. పర్యావరణ హిత జీవనశైలిపై ప్రతిజ్ఞ.
– నవంబర్‌ 2: వాతావరణ మార్పులతో ఆరోగ్యంపై పడే ప్రభావాలపై అవగాహన. ఆసుపత్రుల్లో సౌర, పవన విద్యుత్తు వినియోగానికి ప్రోత్సాహం. గంటపాటు విద్యుత్తు వినియోగం నిలిపివేసి పొదుపుపై ప్రచారం.
– నవంబర్‌ 3: నీటి పొదుపు, నీటి ట్యాంకులు, శుద్ధి యంత్రాల పరిశుభ్రత. ఆసుపత్రుల ఆవరణల్లో మొక్కల పెంపకం.
– నవంబర్‌ 4: చిరుధాన్యాలు, సమతుల ఆహారంపై అవగాహన. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో సంప్రదాయ ఆహార ప్రదర్శనలు. గర్భిణులు, కౌమార బాలికలు, మధుమేహ బాధితులకు పోషకాహారంపై సూచనలు.
– నవంబర్‌ 5: ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపు. గుడ్డ సంచులు, తిరిగి వినియోగించే సీసాల వాడకానికి ప్రోత్సాహం.
– నవంబర్‌ 6: పాడైన ఎలక్ట్రానిక్‌ పరికరాల సేకరణ, అధీకృత సంస్థలకు అప్పగింత. సైకిల్‌ ర్యాలీల ద్వారా అవగాహన.
– నవంబర్‌ 7: ఆసుపత్రుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు. దోమల పెరుగుదలకు కారణమయ్యే ప్రాంతాల తొలగింపు, డెంగీ, మలేరియా నివారణ. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ, వైద్య వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ.

అధికారులకు బాధ్యతలు

వారోత్సవాల నిర్వహణకు జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) రాష్ట్ర కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్‌ జె. విజయలక్ష్మిని రాష్ట్ర స్థాయి నోడల్‌ అధికారిగా నియమించారు. జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారులు, ప్రభుత్వ వైద్య కళాశాలల ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా ఆయుష్‌ అధికారులు, ఆహార భద్రత అధికారులు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలి. శాఖల సమన్వయం, పర్యవేక్షణ కోసం సంయుక్త సంచాలకుడు డాక్టర్‌ బి.వి. సతీష్‌ కుమార్‌, ఆరోగ్య, ఆరోగ్య సంక్షేమ కేంద్రాల రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ జె. నరసింహ నాయక్‌లను కూడా నియమించారు. రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ స్థాయిల్లో సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాలను అమలు చేయాలి. వారోత్సవాల పేరుతో ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకూడదని కమిషనర్‌ కె.వి.ఎన్‌. చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. అంటువ్యాధుల నివారణ, వైద్య వ్యర్థాల నిర్వహణ, భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

ఆహార భద్రత విభాగం ఆధ్వర్యంలో..

ఫుడ్‌ సేఫ్టీ విభాగం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానుంది. ఆహార భద్రత విభాగం డైరెక్టర్‌ పి. అరుణ్‌బాబు ఐఏఎస్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్లు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు జిల్లాల్లో కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.

– పాఠశాలలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ సంస్థల్లో సురక్షిత ఆహారంపై ప్రచారం.
– చిరుధాన్యాల వినియోగం, ఆహార వ్యర్థాల నివారణ, సురక్షిత నీటి వినియోగంపై అవగాహన.
– ఆహార ప్యాకేజింగ్‌లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింపుపై ప్రచారం.