-బాధితులకు భరోసాగా పోలీసు శాఖ
-రాజకీయ ముసుగులో చేసే నేరాలపై ఉక్కుపాదం
-రప్పా రప్పా అంటూ రౌడీయిజం చేస్తే అణచివేయండి
-పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం
-పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
శాంతిభద్రతల పరిరక్షణలో ఏపీ పోలీసు శాఖ దేశానికే ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాక్షించారు. నేరస్తులకు పోలీసు యూనిఫాం చూస్తే భయం కలగాలని, బాధితులకు భరోసా ఏర్పడాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగించే పరిస్థితులు కల్పించాలని పోలీస్ శాఖకు సూచించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో బుధవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఖాకీ అంటే బాధ్యత.. పోలీసు అంటే భరోసా అని సీఎం పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యమని అన్నారు. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేనని చెప్పారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు పోలీసులు తమ కుటుంబాల పండుగలకు దూరమవుతున్నారని అన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్, వీఐపీల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన దసరా ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా ప్రజలు నిర్వహించు కోవటంలో పోలీసుల నిరంతర శ్రమ అభినందనీయమని అన్నారు. 1959 అక్టోబరు 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ పదిమంది పోలీసులు వీరమరణం పొందారని, వారి త్యాగానికి గుర్తుగా ఏటా ఈ రోజును పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదని, సమాజ బాధ్యత అని పేర్కొన్నారు.
శాంతిభద్రతలతోనే పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో ఫ్యాక్షన్‌ను నియంత్రించడంలో, నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో, మత కలహాలను అరికట్టడంలో పోలీసులు అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారని గుర్తుచేశారు. శాంతిభద్రతలు, అభివృద్ధి, ఉపాధి, ప్రజల సుఖసంతోషాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని చెప్పారు. భద్రతపై నమ్మకం ఉన్న ప్రాంతాలకే పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు ఏర్పాటై ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడల్లా శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దేశ భద్రతకు భంగం కలిగించే కుట్రలను ఛేదించి పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచిందని అభినందించారు. పోలీసు విధుల్లో ధైర్యంతోపాటు మానవత్వం కూడా అవసరమని సీఎం సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో వస్తారని, కొందరు భయంతో, మరికొందరు కన్నీళ్లతో వస్తారని చెప్పారు. వారి సమస్యలను సానుభూతితో విని, గౌరవంగా వ్యవహరించి, సత్వర పరిష్కారం చూపాలని కోరారు. పోలీసుల తక్షణ స్పందన ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని పేర్కొన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని ఉపేక్షించకూడదని, రాజకీయాలు నేరస్థులకు రక్షణ కల్పించకూడదని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీలు, సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
సైబర్ నేరాలపై అప్రమత్తత
నేరాలకు పాల్పడే పద్ధతులు మారుతున్నందున దర్యాప్తు విధానాల్లోనూ మార్పులు రావాలని చంద్రబాబు అన్నారు. ఒక్క ఫోన్‌కాల్, లింక్, సందేశంతో జీవితకాలం కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకున్నవారు సైతం ఈ మోసాలకు బలి అవుతున్నారని అన్నారు. నేరాలను ఛేదించడం పోలీసుల సమర్థతకు నిదర్శనమైతే, అవి జరగకుండా నివారించడం అత్యుత్తమ పోలిసింగ్ కు నిదర్శనమని పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను గుర్తించడంతోపాటు, డేటా విశ్లేషణతో వాటి వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీయాలని సూచించారు. డ్రోన్ల వినియోగాన్ని నిఘా సహా వివిధ అవసరాలకు విస్తరించాలని చెప్పారు. ఏఐ లాంటి సాంకేతికతను ఉపయోగించి దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏపీ పోలీసులే అగ్రగాములనే గుర్తింపు దేశవ్యాప్తంగా రావాలని ఆకాంక్షించారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఏపీ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమని సీఎం పేర్కొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణలో ఈగల్ బృందం చేస్తున్న కృషిని అభినందించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా మహిళలకు భద్రత కల్పించ లేకపోతే ప్రయోజనం లేదని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడాలంటేనే నేరస్థులు భయపడే పరిస్థితి తీసుకురావాలని సూచించారు.
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు అండగా
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల ఫలితాలు క్షేత్రస్థాయిలో కనిపించాలని చెప్పారు. తీవ్ర ఒత్తిడితో పనిచేసే పోలీసులు యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని సూచించారు. పోలీసు అమర వీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అమరుల త్యాగాలకు ఘనమైన నివాళి అర్పించాలంటే ప్రజలకు నిరంతర భద్రత కల్పించడమే మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి వంగల పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు అమర జవాన్ స్మృతిచిహ్నం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. షహీద్ పుస్తక్ టోలీ, అమరులు వారు పుస్తకాలను ఆవిష్కరించారు. పోలీసు సంస్మరణ నిధికి సీఎం విరాళం అందించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఫోరెన్సిక్, విపత్తు నిర్వహణ పరికరాలు, ఆక్టోపస్ సహా ఇతర విభాగాల ఆధునిక ఆయుధాల వినియోగం గురించి అడిగి తెలుసుకున్నారు. నిఘా వ్యవస్థలో డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని అధికారులకు సూచించారు.
