తుపాను ప్రభావిత 13 జిల్లాల్లో ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీకి ఓటీపీ నుంచి తాత్కాలిక మినహాయింపు

-విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
-వినియోగదారులకు ఇబ్బందుల్లేకుండా గ్యాస్ సరఫరా చేసేందుకే వెసులుబాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలో ఓటీపీ (OTP) ధృవీకరణ నుంచి తాత్కాలిక మినహాయింపు కల్పించాలని కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ తాత్కాలిక వెసులుబాటు రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో వర్తించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక సమస్యల కారణంగా ఓటీపీ ధృవీకరణలో ఇబ్బందులు తలెత్తకుండా, గృహ వినియోగదారులకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ఈ మినహాయింపు దోహదపడనుంది. నగదు చెల్లింపు ద్వారా సిలిండర్లను నేరుగా పొందే విధానానికి కూడా అనుమతి కల్పించినట్లు పేర్కొంది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర సేవల్లో అంతరాయం కలగకుండా సంబంధిత అధికారులు, గ్యాస్ పంపిణీ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది.