85వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా: అంగిరేకుల గొల్లభామ

-ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 85వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అంగిరేకుల గొల్లభామ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుసుకుని, తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా, వీధి విద్యుత్ దీపాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్‌గా గెలిపించాలని, మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మికి మద్దతు తెలిపి ఆమెను కూడా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
నగర అభివృద్ధిపై దృష్టి సారించాలి: రాయన భాగ్యలక్ష్మి
మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, గత మూడేళ్ల పాలనలో విజయవాడ నగరంలో సంక్షేమం, అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని విమర్శించారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆరోపించారు. బుడమేరు వరదల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాధితులకు తగిన సహాయం అందలేదని పేర్కొన్నారు. నగర అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలని కోరారు.
ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరాటం: మల్లాది విష్ణు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, రైతులకు గిట్టుబాటు ధర, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరోధం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అంశాలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని తెలిపారు. బియ్యం, వంటనూనె, పంచదార, పాలు, గ్యాస్, పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెరుగుదల, పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు, పేదలు, భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. అర్హులకు పెన్షన్లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయవాడ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగేందుకు మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మితో పాటు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.