విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) సభ్యుడిగా (న్యాయ విభాగం) సీనియర్ న్యాయవాది అంచా పాండు రంగారావు శుక్రవారం విజయవాడలోని చీఫ్ సెక్రటరీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంధన శాఖ ద్వారా 2026 అక్టోబర్ 13వ తేదీన జారీ చేసిన జి.ఓ. ఎం.ఎస్. నం. 86 ద్వారా అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 82(5) కింద ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
1968లో అంచా వీరయ్య, రామాంజమ్మ దంపతులకు జన్మించిన అంచా పాండు రంగారావు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గుంటూరు మండలానికి చెందిన గనికపూడి గ్రామస్తులు. జేకేసీ కళాశాల, గుంటూరులో డిగ్రీ విద్యను అభ్యసించిన ఆయన, అనంతరం పూణే విశ్వవిద్యాలయం నుంచి 1991లో ఎల్.ఎల్.బి., 1993లో ఎల్.ఎల్.ఎం. పట్టాలను పొందారు. 1993 జూలై 14న న్యాయవాదిగా నమోదు చేసుకుని తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుదీర్ఘకాలంగా న్యాయవాదిగా సేవలందిస్తున్న రంగారావుకు రిట్ పిటిషన్లు, సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో విశేష అనుభవం ఉంది. వివిధ న్యాయపరమైన అంశాలపై హైకోర్టులో వాదనలు వినిపిస్తూ, పలు ముఖ్యమైన కేసుల్లో తన న్యాయ పరిజ్ఞానాన్ని చాటుకున్నారు. ఆయన వాదించిన కేసులకు సంబంధించిన పలు తీర్పులు ప్రముఖ న్యాయ నివేదికల్లో ప్రచురితమయ్యాయి.
న్యాయవాదిగా వృత్తి ప్రస్థానంతోపాటు ప్రభుత్వ న్యాయవాదిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు. 2000 నుంచి 2004 వరకు వాణిజ్య శాఖకు సంబంధించిన ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా, అనంతరం అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలకు సంబంధించిన వివిధ న్యాయ వ్యవహారాల్లో ఆయనకు విశేష పరిచయం ఉంది.
న్యాయరంగంలో మూడు దశాబ్దాలకు పైగా సాధించిన అనుభవం, వివిధ ప్రభుత్వ శాఖలకు న్యాయవాదిగా అందించిన సేవలు, హైకోర్టులో సుదీర్ఘకాలంగా కొనసాగిస్తున్న న్యాయవాద వృత్తి ప్రస్థానం ఆయనకు ఈ కీలక బాధ్యతలు చేపట్టేందుకు దోహదపడ్డాయి. రాష్ట్ర విద్యుత్ రంగానికి సంబంధించిన నియంత్రణ వ్యవహారాలు, చట్టపరమైన అంశాలు, వివిధ వివాదాల పరిష్కారంలో ఏపీఈఆర్సీ సభ్యుడిగా ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.
సమర్థమైన గణికపూడి నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం న్యాయవాదిగా ఎదిగి, రాష్ట్రస్థాయి కీలక నియంత్రణ సంస్థలో సభ్యుడిగా నియమితులయ్యే స్థాయికి చేరుకోవడం విశేషం. ఆయన నియామకం పట్ల న్యాయరంగ ప్రముఖులు, న్యాయవాద వర్గాలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.
