ఆర్నబ్ తుపాను, ఖరీఫ్ కరువు నష్టాల పరిశీలనకు రాష్ట్రానికి రెండు కేంద్ర బృందాలు

-శని, ఆదివారాల్లో తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటన
-సోమ, మంగళవారాల్లో కరువు ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
-బాధితులు, రైతులతో నేరుగా మాట్లాడి నష్టాలపై అంచనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్నబ్ తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని, ఖరీఫ్‌-2026లో నెలకొన్న కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక బృందాలను రాష్ట్రానికి పంపుతోంది. తుపాను ప్రభావిత జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఒక కేంద్ర బృందం పర్యటించనుండగా, కరువు ప్రభావిత జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో మరో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
తుపాను నష్టాల పరిశీలనకు ఏడుగురు సభ్యులతో కేంద్ర బృందం

ఆర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చిత్తరంజన్ దాష్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (IMCT) రాష్ట్రంలో పర్యటించనుంది.

శనివారం విజయవాడలోని ఆర్టీజీఎస్‌లో రాష్ట్ర ఉన్నతాధికారులు తుపాను సమయంలో చేపట్టిన సహాయక చర్యలు, జరిగిన ఆస్తి నష్టం, విద్యుత్, వ్యవసాయం, రహదారులు తదితర రంగాలపై ప్రభావాన్ని కేంద్ర బృందానికి వివరించనున్నారు.

అనంతరం కేంద్ర బృందం రెండు బృందాలుగా విడిపోయి తుపాను ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. మొదటి బృందంతో ఆర్టీజీఎస్ సీఈవో, ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్, రెండో బృందంతో సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధరబాబు పర్యటించనున్నారు.

శనివారం: మొదటి బృందం కోనసీమ జిల్లాలో, రెండో బృందం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తుంది.
ఆదివారం: మొదటి బృందం కాకినాడ జిల్లాలో, రెండో బృందం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తుంది.

ఈ సందర్భంగా తుపాను కారణంగా జరిగిన నష్టాలను స్వయంగా పరిశీలించడంతో పాటు బాధిత ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
తుపాను నష్టాల పరిశీలనకు వచ్చే కేంద్ర బృందం సభ్యులు

ప్రశాంత్ ఆర్మోరికర్ – ఏడీసీ, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ.
రేఖారాణి కొల్లు – సూపరింటెండింగ్ ఇంజనీర్, జల వనరుల మంత్రిత్వ శాఖ, సీడబ్ల్యూసీ.
హిమాలయ గార్గ్ – అసిస్టెంట్ డైరెక్టర్, వ్యయ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
రాకేష్ కుమార్ సింగ్ – సూపరింటెండింగ్ ఇంజనీర్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ.
అలోక్ జవహర్ – డిప్యూటీ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ.
ప్రణయ్ గార్గ్ – డిప్యూటీ డైరెక్టర్, విద్యుత్ మంత్రిత్వ శాఖ.
డాక్టర్ ఎస్.వి.ఎస్.పి. శర్మ – సైంటిస్ట్ ‘SF’, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), ఇస్రో.

ఖరీఫ్ కరువు పరిస్థితుల అధ్యయనానికి మరో కేంద్ర బృందం

మరోవైపు రాష్ట్రంలో ఖరీఫ్‌-2026లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ చిన్మయ్ గోట్మారే నేతృత్వంలోని పది మంది సభ్యుల కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది.

ఈ బృందం కరువు ప్రభావిత శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో పర్యటించనుంది. రెండు బృందాలుగా విడిపోయి ఆయా జిల్లాల్లోని కరువు పరిస్థితులను పరిశీలించడంతో పాటు రైతులతో నేరుగా మాట్లాడి పంటల పరిస్థితి, వ్యవసాయ నష్టాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనుంది.

కేంద్ర వ్యవసాయ శాఖ కరువు మాన్యువల్ నిబంధనల ప్రకారం ఖరీఫ్‌-2026లో రాష్ట్రంలోని 283 మండలాలను తీవ్ర కరువు మండలాలుగా, 105 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించినట్లు ప్రఖర్ జైన్ వివరించారు.

క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం బృందం తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. బుధవారం కేంద్ర బృందం ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
కరువు పరిస్థితుల పరిశీలనకు వచ్చే కేంద్ర బృందం సభ్యులు

ప్రభా కాంతి – అసిస్టెంట్ డైరెక్టర్, మహాలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్ (MNCFC).
వినోద్ సామంత్ – అండర్ సెక్రటరీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
పంకజ్ పహాడియా – డిప్యూటీ డైరెక్టర్, వ్యయ విభాగం.
ఎన్.వి. సతీష్ సీమాకుర్తి – డైరెక్టర్, మానిటరింగ్ అండ్ అప్రైజల్ డైరెక్టరేట్.
డాక్టర్ కె. పొన్నుసామి – డైరెక్టర్, ఆయిల్ అండ్ సీడ్స్ డెవలప్‌మెంట్.
అనురాధ బటానా – సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, నీతి ఆయోగ్.
ధీరేంద్ర కుమార్ – ఆర్ఐసి.
ప్రదీప్ కుమార్ – అండర్ సెక్రటరీ, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ.
డాక్టర్ సాక్షి భదౌరియా – పశుసంవర్ధక అధికారి, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ.

తుపాను నష్టం, కరువు పరిస్థితులపై కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో చేపట్టనున్న ఈ పరిశీలనల ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టాలపై సమగ్ర అంచనా రూపొందించనున్నారు. బాధితులకు, రైతులకు అందించాల్సిన సహాయం, పరిహారంపై తదుపరి చర్యలకు ఈ పర్యటనలు కీలకం కానున్నాయి.