అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం

– ఎక్సైజ్ చట్టాల అమల్లో నిర్లక్ష్యానికి తావులేదు
– సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘాకు చ‌ర్య‌లు
– ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీధ‌ర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ రాహుల్ దేవ్ శర్మ‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా, విక్ర‌యాల‌పై ఉక్కుపాదం మోప‌డం జ‌రుగుతుంద‌ని.. ఎక్సైజ్ చ‌ట్టాల‌ను పటిష్టంగా అమ‌లుచేయ‌నున్న‌ట్లు ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ సీహెచ్ శ్రీధ‌ర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ రాహుల్ దేవ్ శర్మ అన్నారు.
విజ‌య‌వాడ క‌రెన్సీ న‌గ‌ర్‌లోని ప్రొహిబిష‌న్‌, ఎక్సైజ్ ఏసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాల‌యంలో ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల ఎక్సైజ్ అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఇందులో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో చేప‌ట్టాల్సిన చ‌ర్య‌లు, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు త‌దిత‌ర అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.
ఈ సంద‌ర్భంగా ఎక్సైజ్ క‌మిష‌న‌ర్ చామ‌కూరి శ్రీధ‌ర్ మాట్లాడుతూ మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా తనిఖీలు నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించకుండా, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ రాహుల్ దేవ్ శ‌ర్మ మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం రవాణా కాకుండా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ప్ర‌ధాన కార్యాల‌య డిప్యూటీ క‌మిష‌న‌ర్ వివేక్‌, విజ‌య‌వాడ డిప్యూటీ క‌మిష‌న‌ర్ టి.శ్రీనివాస‌రావు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ సీహెచ్ లావ‌ణ్య‌, ఎన్‌టీఆర్‌, కృష్ణా జిల్లాల ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్‌.శ్రీనివాస‌రావు, రెండు జిల్లాల అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్లు, స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్లు తదిత‌రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఎక్సైజ్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్‌.. గొల్ల‌పూడిలోని శ్రీసాయి కృష్ణ వైన్స్‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి రికార్డుల‌ను ప‌రిశీలించారు. మద్యం దుకాణాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అక్రమ విక్రయాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.