-విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం.. 1,663 విద్యుత్ స్తంభాలు ధ్వంసం
-పునరుద్ధరణ పనుల్లో 600 మంది సిబ్బంది.. త్వరితగతిన సరఫరా పునరుద్ధరణకు సీఎండీ ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APCPDCL) పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.4.52 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తుపాను ధాటికి మొత్తం 1,663 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి.
విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం
తుపాను కారణంగా 33 కేవీ పరిధిలో 125 స్తంభాలు, 11 కేవీ పరిధిలో 749 స్తంభాలు, ఎల్టీ పరిధిలో 789 స్తంభాలు దెబ్బతిన్నాయి. వీటితో పాటు విద్యుత్ లైన్లు, ఫీడర్లు, సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అధికారుల నివేదిక ప్రకారం 168 సబ్స్టేషన్లు, 65 మేర 33 కేవీ ఫీడర్లు, 735 మేర 11 కేవీ ఫీడర్లు ప్రభావితమయ్యాయి. అలాగే 33 కేవీ విద్యుత్ లైన్లు 15.3 కిలోమీటర్లు, 11 కేవీ లైన్లు 57.05 కిలోమీటర్లు, ఎల్టీ లైన్లు 82.07 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయి. అదేవిధంగా 280 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్లు) దెబ్బతిన్నట్లు గుర్తించారు. పవర్ ట్రాన్స్ఫార్మర్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాలు, వ్యవసాయేతర, వ్యవసాయ విద్యుత్ సర్వీసుల వివరాలను కూడా అధికారులు నష్టం అంచనాలో పరిగణనలోకి తీసుకున్నారు.
పునరుద్ధరణ పనుల్లో 600 మంది సిబ్బంది
తుపాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు APCPDCL యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కృష్ణా జిల్లాలో సుమారు 600 మంది విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు, లైన్ల మరమ్మతులు, ఇతర సాంకేతిక పనులను వేగవంతం చేశారు.
పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎండీ
తుపాను ప్రభావానికి గురైన కృష్ణా జిల్లాలోని పెడన, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను APCPDCL సీఎండీ పుల్లారెడ్డి, డైరెక్టర్ (టెక్నికల్) మురళీకృష్ణ యాదవ్ పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన వారు అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాని గ్రామాలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందించాలని సీఎండీ అధికారులను ఆదేశించారు.
వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడమే ప్రధాన లక్ష్యంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
