-తుపాను హెచ్చరికలకు తగ్గట్లు సత్వరం చర్యలు చేపట్టాలి
-రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు
-జిల్లా అధికారులదే బాధ్యత: ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు
-గర్భిణీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుపాను ప్రభావం దృష్ట్యా ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక, గ్రామస్థాయి ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వైద్య సేవల్లో అంతరాయం కలగకూడదని సూచించారు. ఈ నెల 27న కృష్ణా, బాపట్ల జిల్లాలకు, 28న 13 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కే.వి.ఎన్. చక్రధర్ బాబు జిల్లా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
ముందస్తు ఏర్పాట్లు.. నిరంతర పర్యవేక్షణ
జిల్లాల్లో 24 గంటలూ పనిచేసే అత్యవసర నియంత్రణ గదులు ఏర్పాటు చేయాలి. వరద ముప్పు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది, మందులు, పరికరాలు, విద్యుత్తు, నీటి సదుపాయాలను తనిఖీ చేయాలి. వైద్య సిబ్బందికి విధులు కేటాయించి అదనపు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. రెవెన్యూ, పోలీసు, ఇతర శాఖలతో పాటు 108, 104, 102 సేవలతో సమన్వయం చేసుకోవాలి.
మందులు, పరికరాలు సిద్ధం
అత్యవసర మందులు, ఓఆర్‌ఎస్ ద్రావణాలు, సెలైన్‌లు, ప్రసూతి మందులు, శిశు సంరక్షణ సామగ్రి, ఆక్సిజన్, జనరేటర్లు, ఇంధనం, తాగునీరు సిద్ధంగా ఉంచాలి. మందులు, టీకాల నిల్వకు అవసరమైన శీతలీకరణ సదుపాయాలను తనిఖీ చేయాలి. వరద నీటితో వైద్య పరికరాలు, రికార్డులు దెబ్బతినకుండా చూడాలి. అత్యవసర రోగుల తరలింపునకు 108 వాహనాలు, రక్తనిధులు, ప్రసూతి కేంద్రాలతో సమన్వయం చేసుకోవాలి. అనుమతుల కోసం వేచి ఉండి రోగుల తరలింపులో ఆలస్యం చేయకూడదు.
26,768 మంది గర్భిణుల తరలింపునకు చర్యలు
అక్టోబర్ 23 నుంచి నవంబర్ 6 మధ్య ప్రసవ తేదీ ఉన్న 26,768 మంది గర్భిణుల వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులకు పంపించారు. లోతట్టు, వరద ముప్పు ప్రాంతాల్లోని గర్భిణులతో పాటు హై రిస్క్ గర్భిణులు, తీవ్ర రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలున్నవారు, గతంలో సిజేరియన్ జరిగినవారిని ప్రాధాన్యంగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. రవాణా అంతరాయాలు ఎదురయ్యే ప్రాంతాల్లో ముందుగానే తరలింపు చేపడుతున్నారు. ఆసుపత్రుల్లో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసి, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఇతర వాహనాలను వినియోగిస్తున్నారు.
గ్రామస్థాయి ఆరోగ్య కేంద్రాల సిబ్బంది గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, క్రమం తప్పకుండా మందులు వాడేవారి కుటుంబాల వివరాలు సేకరించాలి. ఓఆర్‌ఎస్, ప్రథమ చికిత్స సామగ్రి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి.
తాగునీరు, పారిశుద్ధ్యంపై నిఘా
ప్రభావిత గ్రామాల్లో తాగునీటి వనరులను పరీక్షించి కలుషిత నీటి వినియోగాన్ని నివారించాలి. ఆసుపత్రులు, సహాయక శిబిరాల్లో పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు చర్యలు చేపట్టాలి. అతిసారం, జ్వరం, అంటువ్యాధులు, లెప్టోస్పైరోసిస్, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, పాముకాటు, నీట మునిగిన ఘటనలపై నిఘా ఉంచాలి. వ్యాధులు అసాధారణంగా పెరిగినా, ఒకేచోట ఎక్కువ కేసులు నమోదైనా వెంటనే అధికారులకు తెలియజేయాలి. బాధితులకు ప్రథమ చికిత్స అందించి అవసరమైన వైద్య కేంద్రాలకు తరలించాలి.
తుపాను అనంతరం వైద్య సేవల పునరుద్ధరణ
పరిస్థితులు సురక్షితమైన తర్వాత నిలిచిపోయిన వైద్య పరీక్షలు, ప్రసవాలు, టీకాలు, ప్రయోగశాల సేవలు, మందుల పంపిణీని పునరుద్ధరించాలి. తాగునీటి భద్రత, పారిశుద్ధ్యం, వ్యాధుల ముప్పును పరిశీలించాలి. తల్లి, శిశు వైద్య పరీక్షలు పూర్తి చేసి మందుల నిల్వలను భర్తీ చేయాలి. దెబ్బతిన్న వైద్య పరికరాలు, సదుపాయాలకు మరమ్మతులు చేపట్టాలి.
అధికారులదే బాధ్యత
జిల్లా స్థాయిలో సన్నద్ధత, సమన్వయం, పర్యవేక్షణ బాధ్యత జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులదేనని కమిషనర్ కే.వి.ఎన్. చక్రధర్ బాబు స్పష్టం చేశారు. ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు సేవలు కొనసాగించేలా చూడాలి. గ్రామస్థాయి సిబ్బంది ప్రమాదంలో ఉన్న కుటుంబాలను గుర్తించడం, ప్రజలకు హెచ్చరికలు ఇవ్వడం, వ్యాధులపై నిఘా, సమాచార నివేదికల బాధ్యతలు నిర్వహించాలి. ప్రతికూల వాతావరణం ప్రారంభమయ్యేలోపు జిల్లా సన్నద్ధత నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులను కూడా అప్రమత్తం చేసినట్లు వైద్య విద్య సంచాలకుడు ఎ. విష్ణువర్ధన్ తెలిపారు.
