-ప్రతి ఆటోకు రూట్ మ్యాప్ ఏర్పాటు చేయాలి: నగర కమిషనర్ కె. మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో ఈ-ఆటోల ద్వారా నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేపట్టాలని, ప్రతి ఈ-ఆటోకు రూట్ మ్యాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
సోమవారం కమిషనర్ శ్యామల నగర్, భాగ్య నగర్, కృష్ణ నగర్, శ్రీనగర్, కాకుమానువారితోట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
ఈ-ఆటోలకు కేటాయించిన ప్రాంతాల్లో నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా పర్యవేక్షణ చేపట్టేందుకు సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించాలని సూచించారు. నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోయే ప్రాంతాలు (గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్) ఉండకూడదని స్పష్టం చేశారు. వ్యాపారులు, వీధి వ్యాపారులు రోడ్లపై, డ్రైనేజీల్లో వ్యర్థాలు వేస్తే భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు.
తుఫాను నేపథ్యంలో డ్రైనేజీల్లో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అనంతరం పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న నూతన సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అభివృద్ధి పనికి థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ నుంచి నాణ్యతా ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలని ఆదేశించారు.
ప్రతి ఏఈ, కార్యదర్శి తమ పరిధిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నీటి నమూనాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు, సంబంధిత నివేదికలను రిజిస్టర్లలోనూ భద్రపరచాలని స్పష్టం చేశారు. తాగునీటి పైప్లైన్ల లీకేజీలను అరికట్టడంతో పాటు రోడ్లపై ఏర్పడిన గుంతలకు ఎప్పటికప్పుడు ప్యాచ్‌వర్క్‌లు చేపట్టాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, ఈఈ విష్ణువర్ధన్, డీఈఈలు వెంకటరమణ, చైతన్య, ఎస్ఎస్లు సోమశేఖర్, సాంబయ్య, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
