-కౌన్సిల్ హాల్, చాంబర్లను సిద్ధం చేయాలని అధికారులకు కమిషనర్ ఆదేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ నూతన మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కౌన్సిల్ హాల్, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చాంబర్లను అన్ని హంగులతో సిద్ధం చేయాలని సూచించారు.
సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని వివిధ విభాగాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. కౌన్సిల్ హాల్లో సభ్యులు కూర్చునేందుకు చేపట్టిన సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు కీలకమైన మైక్ సిస్టమ్, సౌండ్ వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, మైక్‌లు, సౌండ్ సిస్టమ్ అన్నీ సక్రమంగా పనిచేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మేయర్ చాంబర్‌తో పాటు డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ గదులను పరిశీలించి, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
నగరపాలక సంస్థకు విచ్చేసే కార్పొరేటర్ల సౌకర్యార్థం కేటాయించిన గదులను కూడా పరిశీలించారు. ఆయా గదుల్లో అవసరమైన ఫర్నిచర్, ఇతర సదుపాయాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం జీఎంసీ ప్రధాన కార్యాలయ ప్రాంగణం, వివిధ విభాగాల పరిసరాలను పరిశీలించిన కమిషనర్.. అక్కడక్కడా పేరుకుపోయిన నిరుపయోగ వస్తువులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వినియోగంలో లేని పాత బీరువాలు, విరిగిపోయిన ఫర్నిచర్, ఇతర పనికిరాని సామగ్రిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. కార్యాలయ ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ ఐ. కిషోర్, డిప్యూటీ కమిషనర్ బి. శ్రీనివాసరావు, ఎస్ఈ జి. వెంకటేశ్వరరావు, డీఈఈ చైతన్య, మేనేజర్ బాలాజీ బాషా పాల్గొన్నారు.
