‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది

Gottipati

-తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు.. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తం
-1912 కాల్‌సెంటర్‌ బలోపేతం.. ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరణకు ఏర్పాట్లు
-ఇతర శాఖలతో సమన్వయానికి ప్రత్యేక గ్రూప్‌ ఏర్పాటు
-విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
‘అర్నబ్‌’ తుపాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిన ప్రాంతాల్లో త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సుమారు 6 వేల మంది అనుభవజ్ఞులైన అధికారులు, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. మంగళవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తుపాను సన్నద్ధత, విద్యుత్‌ సరఫరా పరిస్థితి, అత్యవసర సేవలపై సమీక్షించారు.

సెలవులు రద్దు.. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
తుపాను ప్రభావం లేని ప్రాంతాల్లోని అవసరమైన సిబ్బంది సెలవులను రద్దు చేసి, ప్రభావిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్‌ సంస్థల డైరెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ప్రాంతాల్లో డైరెక్టర్లు స్వయంగా పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
తెగిపడిన విద్యుత్‌ తీగలు, కూలిన స్తంభాలు, దెబ్బతిన్న కండక్టర్ల మరమ్మతులతోపాటు సమస్యలు తలెత్తిన 132 కేవీ సబ్‌స్టేషన్ల వద్ద పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. తుపాను తీవ్రత దృష్ట్యా అవసరమైన విద్యుత్‌ సామగ్రిని డివిజనల్‌ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో ముందుగానే సిద్ధం చేసినట్లు చెప్పారు.

ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరణ
విద్యుత్‌ సరఫరా అంతరాయాలు, తెగిపడిన తీగలు, కూలిన స్తంభాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వెంటనే స్పందించేందుకు 1912 కాల్‌సెంటర్‌ను బలోపేతం చేసినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే ప్రజలు 1912కు సమాచారం అందించాలని సూచించారు.

ఇతర శాఖలతో సమన్వయం
అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు విద్యుత్‌ శాఖ ఇతర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం పెంచింది. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, కలెక్టరేట్‌ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, స్థానిక సచివాలయ సిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడి జరిగేలా ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏ శాఖకు విద్యుత్‌ సమస్యకు సంబంధించిన సమాచారం అందినా వెంటనే ఆ గ్రూపులో పంచుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దీనివల్ల సంబంధిత ప్రాంతాల్లోని సిబ్బంది త్వరగా స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు వీలవుతుందన్నారు.

విద్యుత్‌ తీగలను తాకొద్దు
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. తెగిపడిన విద్యుత్‌ తీగలు, కండక్టర్లను చేతితో తాకవద్దని హెచ్చరించారు. రహదారులపై పడిన విద్యుత్‌ పరికరాల దగ్గరకు వెళ్లడం కూడా ప్రమాదకరమని తెలిపారు. అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ శాఖ సిబ్బందికి లేదా 1912 కాల్‌సెంటర్‌కు సమాచారం అందించాలని కోరారు.
ప్రాణనష్టం జరగకుండా, సాధ్యమైనంత మేర ఆస్తి నష్టాన్ని నివారించేలా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. తుపాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.