-ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించే లక్ష్యంతో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నవంబర్ 7వ తేదీ వరకు జరగనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల్లో యోగా, నడక, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, ఆయుష్ వైద్య కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో యోగా, మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించగా, విశాఖపట్నం కేజీహెచ్‌లో వైద్య సిబ్బంది పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. విమ్స్‌లోని వైద్య సిబ్బంది ఆసుపత్రి వార్డుల్లో ప్రతిజ్ఞ చేశారు. క్రిటికల్ కేర్ కేంద్రంలో యోగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు, కడప, పాడేరు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు హనుమాన్‌పేట, కాశిమికోట, రొక్కడిబండసత్రం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
విస్తృత కార్యాచరణ
ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, జిల్లా, మండల స్థాయిల్లో ఈ నెల 7వ తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నీరు, విద్యుత్తును పొదుపుగా వినియోగించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పరిసరాల పరిశుభ్రత, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. యోగా, నడక, వ్యాయామం, మొక్కల పెంపకం, చిరుధాన్యాలు, సమతుల ఆహారం, నీటి పొదుపు అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాల తగ్గింపు, ఆసుపత్రుల పరిశుభ్రత, డెంగీ, మలేరియా నివారణపైనా ప్రచారం నిర్వహించనున్నారు.
ఆహార భద్రత విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సురక్షిత ఆహారం తీసుకోవడం, చిరుధాన్యాల వినియోగం పెంచడం, ఆహార వ్యర్థాలను నివారించడం, సురక్షిత నీటిని వినియోగించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించడం, వ్యర్థాలను తగ్గించడం, పర్యావరణ హిత అలవాట్లను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడమే సుస్థిర జీవనశైలి ముఖ్య ఉద్దేశమని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు తెలిపారు.
భారత్ అధ్యక్షతన బ్రిక్స్ వారోత్సవాలు
బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా తదితర దేశాలతో కూడిన అంతర్జాతీయ సహకార వేదిక. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవన విధానాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
