-అర్నబ్ తుఫాను నష్టాల అంచనాకు పశ్చిమగోదావరి జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
-తుఫాను నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కేంద్ర బృందం
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త:
అర్నబ్ తుఫాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ, రహదారులు, భవనాలు, నీటిపారుదల, విద్యుత్, గృహ నిర్మాణం తదితర రంగాల్లో జరిగిన నష్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయడానికి కేంద్ర బృందం ఆదివారం జిల్లాలో పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, నాయకత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం జిల్లాలో పర్యటించి వివిధ రంగాలకు జరిగిన నష్టాలను పరిశీలించింది.
ఆదివారం భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్నబ్ తుఫాను ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తో కలిసి పరిశీలించారు. తుఫాను ప్రభావం, జిల్లాలో జరిగిన నష్టం, సహాయక చర్యలు, పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించిన ఛాయాచిత్రాలను చూపించి జిల్లా కలెక్టర్ కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం వశిష్ట సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుఫాను కారణంగా జిల్లాలో వివిధ రంగాలకు జరిగిన నష్టం, బాధిత కుటుంబాల వివరాలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని కేంద్ర బృందానికి వివరించారు.
జిల్లాలో మొత్తం సుమారు 4,603 గృహాలు దెబ్బతిన్నాయని, 57,999 కుటుంబాలు ప్రభావితమయ్యాయని వివరించారు. వీరిలో 16,187 మత్స్యకార కుటుంబాలు, 5,574 చేనేత కుటుంబాలు, ఇతర వర్గాలకు చెందిన 36,238 కుటుంబాలు ఉన్నట్లు తెలిపారు.
తుఫాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 13,885 చెట్లు నేలకొరిగాయని, 4,244 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. పశువుల కొట్టాలకు సంబంధించి 24 పూర్తిగా, 318 పాక్షికంగా దెబ్బతిన్నాయని, తుఫాను కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
అర్నబ్ తుఫాను ప్రభావంతో జిల్లాలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, మొత్తం 1,99,554 ఎకరాలు (80,756.64 హెక్టార్లు) వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైందని వివరించారు.
ఉద్యానవన శాఖకు సంబంధించి అరటి పంట 1,194.32 ఎకరాలు (483.53 హెక్టార్లు), కొబ్బరి పంట 1,019.62 ఎకరాలు (196.57 హెక్టార్లు), కూరగాయల పంటలు 668.33 ఎకరాలు (108.68 హెక్టార్లు), ఇతర పండ్ల తోటలు 948.55 ఎకరాలు (276.47 హెక్టార్లు) మేరకు దెబ్బతిన్నట్లు నివేదికలో పొందుపరిచినట్లు తెలిపారు.
మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన పడవలు, వలలు, ఆక్వా సాగు చెరువులు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్నాయని, మొత్తం 460 పడవలు, 150 వలలు దెబ్బతిన్నాయని, 1,910.12 హెక్టార్లు లేదా 4,720 ఎకరాల్లో ఆక్వా సాగు చెరువులకు నష్టం వాటిల్లినట్లు వివరించారు.
తుఫాను కారణంగా 51 గేదెలు, 10 ఆవులు, 356 గొర్రెలు, మేకలు మృతి చెందాయని, 8,470 కోళ్లు మృతి చెందినట్లు నివేదికలో నమోదైందని తెలిపారు.
జిల్లాలో 15 చేనేత యూనిట్లు దెబ్బతిన్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్థలకు సంబంధించి 34 పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, పశువైద్య ఆసుపత్రులు కలిపి మొత్తం 20 ఆసుపత్రుల భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిలో 6 పూర్తిగా, 14 పాక్షికంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 6 ప్రభుత్వ కార్యాలయ భవనాలు కూడా దెబ్బతిన్నాయని వివరించారు.
రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని మొత్తం 86 రహదారులు దెబ్బతిన్నాయని, వీటిలో 18 రాష్ట్ర రహదారులు, 68 జిల్లా రహదారులు ఉన్నాయని, ఈ రహదారులపై 552.349 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 74 రహదారులు మొత్తం 54.6 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నాయని వివరించారు.
తుఫాను ప్రభావంతో జిల్లాలో విద్యుత్ వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లిందని, దెబ్బతిన్న విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. మొత్తం 409 గ్రామాల్లో ఇప్పటివరకు 209 గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు, విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం 125 బృందాలను ఏర్పాటు చేసి 1,556 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు, జిల్లాలో 20 గ్రామీణ సమగ్ర రక్షిత మంచినీటి పథకాలకు జనరేటర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గత మూడు రోజులుగా 392 ఆవాసాల్లో ఈ పథకాల ద్వారా నీటి సరఫరా అందిస్తున్నట్లు, 882 నీటి ట్యాంకర్లు, భూస్థాయి నీటి నిల్వ కేంద్రాల ద్వారా జిల్లాలోని మొత్తం 409 గ్రామ పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు.
అనంతరం కేంద్ర బృందం సభ్యులు జిల్లా యంత్రాంగం చేపట్టిన సహాయక, పునరుద్ధరణ చర్యలను అభినందించారు. అర్నబ్ తుఫానును జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొని, ముందస్తు చర్యలతో పాటు విపత్తు సమయంలో, అనంతరం చేపట్టిన సహాయక, పునరుద్ధరణ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో చక్కగా నిర్వహించారని ప్రశంసించారు. జిల్లాలో జరిగిన నష్టాలను పరిశీలించామని, నష్టం తీవ్రతను అంచనా వేసి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని కేంద్ర బృందం సభ్యులు తెలిపారు.
కేంద్ర బృందంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్, కేంద్ర జల సంఘం, హైదరాబాద్కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కొల్లు రేఖా రాణి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ శాస్త్రవేత్త డా. ఎస్.వి.ఎస్.పి. శర్మ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, డిఆర్ఓ పి. గ్లోరియా, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
