అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మురసు తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేసింది. తుపాను ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో 1,688 వైద్య బృందాలు, 116 సహాయ శిబిరాలను సిద్ధం చేసింది. మొత్తం 13,165 అత్యవసర పడకలు, అవసరమైన మందులు, 43,672 పాముకాటు నివారణ ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచింది. 733 అత్యవసర అంబులెన్సులు (108), 300 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు (102), 721 సంచార వైద్య వాహనాలను (104) సిద్ధం చేసింది. ప్రసవ గడువు దగ్గరపడిన గర్భిణులను
సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
అన్ని వైద్యశాలల్లో అత్యవసర వైద్య సేవలకు అవసరమైన మందులను సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లోని 121 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా 1,833 వైద్యశాలల్లో జనరేటర్లు, ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయాలను సిద్ధం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో అంటువ్యాధుల నిఘా కేంద్రాలను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
గర్భిణుల భద్రతకు ప్రత్యేక చర్యలు
నవంబర్ 1 నుంచి 10వ తేదీ మధ్య ప్రసవ గడువు ఉన్న 6,870 మంది గర్భిణులను గుర్తించారు. వీరిలో 493 మందిని ఇప్పటికే సమీప వైద్యశాలలకు తరలించారు. మిగిలిన వారిని అవసరాన్ని బట్టి ముందుగానే తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారి నివాస ప్రాంతాలను బట్టి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ప్రసవానికి సదుపాయాలు కల్పించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో కలుషిత నీరు, దోమలు, ఆహారం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వైద్యశాలలు, సహాయ శిబిరాల వద్ద పారిశుద్ధ్య పనులకు ఏర్పాట్లు చేశారు. నీటిని శుభ్రపరిచేందుకు క్లోరిన్ మాత్రలను అందుబాటులో ఉంచారు. సురక్షిత తాగునీరు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పురపాలక శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు.
