మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త:
తుఫాను సమయంలో ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వైసీపీ అధినేత జగన్ రాజకీయ విమర్శలు చేయడం తగదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 40 వేల మంది ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు సేవలందిస్తున్నారని, బాధితులకు ఆహారం, నిత్యావసర వస్తువులతో పాటు వివిధ వర్గాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32,800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వరి పంట నష్టపరిహారాన్ని ఎకరాకు రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెంచామని, పెండింగ్లో ఉన్న రూ.1,700 కోట్ల ధాన్యం బకాయిలను విడుదల చేశామని పేర్కొన్నారు.
పులివెందులలో 64 ఎంపీటీసీ స్థానాలకు వైసీపీ నామినేషన్లు వేయలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు. విపత్తుల సమయంలో రాజకీయ విమర్శలు మానుకుని బాధిత ప్రజలకు అండగా నిలవాలని జగన్కు సూచించారు.
