నిడదవోలు అభివృద్ధికి కూటమి అభ్యర్థుల గెలుపు కీలకం: దేవినేని ఉమా

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త:
నిడదవోలు పట్టణ సమగ్ర అభివృద్ధికి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కీలకమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం నిడదవోలులో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కందుల దుర్గేష్, దేవినేని ఉమా, బూరుగుపల్లి శేషారావు పాల్గొని కూటమి అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తోందన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని, గత 27 నెలల్లో పెన్షన్ల కోసం రూ.79 వేల కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇదే అభివృద్ధి నిడదవోలు మున్సిపాలిటీలో కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.