-తెనాలి జిల్లా ఆసుపత్రిలో హబ్ అండ్ స్పోక్ విధానంలో బాధితులకు స్వాంతన
-గుంటూరు జీజీహెచ్ వైద్యుల సూచన మేరకు అక్కడికక్కడే ఖరీదైన ఇంజెక్షన్‌తో చికిత్స
-ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా 12 ఏళ్లలో 1.66 లక్షల మందికి వైద్యసేవలు
-ఈరోజు(గురువారం) ప్రపంచ పక్షవాత దినోత్సవం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
పక్షవాతం బాధితులకు ఉన్నత వైద్యసేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చేరువ చేస్తోంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలను కొనసాగిస్తూనే, జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లోనూ పక్షవాతం బాధితులకు చికిత్సను క్రమంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే గత నెలలో ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద గత ఆగస్టు నుంచి తెనాలి జిల్లా ఆసుపత్రిలో పక్షవాతం బాధితులకు హబ్ అండ్ స్పోక్ విధానంలో ఉన్నత చికిత్సను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు తెనాలి జిల్లా ఆసుపత్రిలో మొత్తం 58 మంది బాధితులకు గుంటూరులోని బోధనాసుపత్రి (హబ్)లో వైద్య నిపుణుల సూచనల మేరకు చికిత్స అందించారు. 9 మందికి రక్తపు గడ్డను కరిగించే చికిత్సలో భాగంగా బాధితులకు ఖరీదైన టెనెక్టెప్లేజ్ ఇంజెక్షన్లు ఇవ్వగా వారు కోలుకున్నారు. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు పనితీరును నిశితంగా పరిశీలించి, ఇతర జిల్లా ఆసుపత్రుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా 2014–15 నుంచి 2025–26 వరకు 12 ఏళ్లలో 1,66,103 పక్షవాతం (stroke) కేసులకు చికిత్స అందించారు. ఇందుకోసం మొత్తం రూ.441.96 కోట్లు ఖర్చు చేయగా, ఏటా సగటున రూ.36.83 కోట్ల వ్యయం నమోదైంది.
ప్రతి ఏడాదీ అక్టోబర్ 29న ప్రపంచ పక్షవాత దినం
పక్షవాతం నివారణ, లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స పొందడంపై అవగాహన కల్పించేందుకు ఏటా అక్టోబరు 29న ప్రపంచ పక్షవాత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది సందేశం ‘ప్రతి నిమిషం కీలకమే’.
ఆ ఇంజక్షన్ ఖరీదు మార్కెట్లో రూ.40 వేలకు పైనే
తెనాలి జిల్లా ఆసుపత్రిలో పక్షవాతం బాధితులకు త్వరగా చికిత్స అందించే చర్యల్లో భాగంగా ఖరీదైన 50 టెనెక్టెప్లేజ్ ఇంజెక్షన్లను (20 ఎంజీ) అందుబాటులో ఉంచారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నాళంలో రక్తం గడ్డకట్టడం వల్ల ఇస్కీమిక్ పక్షవాతం వస్తుంది. ఇలాంటి బాధితులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి, వైద్యుల సిఫారసు మేరకు రక్తపు గడ్డను కరిగించే చికిత్స అందిస్తారు. పక్షవాతం లక్షణాలతో ఆసుపత్రికి వచ్చిన బాధితులకు వెంటనే ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, సీటీ స్కానింగ్ ద్వారా వ్యాధి రకాన్ని గుర్తిస్తారు. వైద్యుల సిఫారసు మేరకు బాధితులకు కీలకమైన తొలి గంటల్లోనే వైద్యసేవలు అందిస్తున్నారు. స్పోక్ కేంద్రాల్లో బాధితులకు ప్రాథమిక పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి, ఆ వివరాలను ప్రత్యేక పక్షవాత యాప్ ద్వారా హబ్ కేంద్రాల్లోని నిపుణులకు పంపుతున్నారు. వారు నివేదికలను పరిశీలించి, తదుపరి చికిత్సపై సలహాలు ఇస్తున్నారు. టెనెక్టెప్లేజ్ 20 ఎంజీ ఇంజెక్షన్ ధర బహిరంగ మార్కెట్లో రూ.40,000కు పైగా ఉంది. ఇప్పటికే గుండె పోటు బాధితులకు సెకండరీ ఆసుపత్రుల్లో స్టెమీ ప్రాజెక్టు కింద హబ్ అండ్ స్పోక్ విధానంలో ఇటువంటి చికిత్సనే అందిస్తున్నారు. గుండెపోటు, పక్షవాతం కేసులకు ఇదే ఇంజక్షన్ ఇస్తున్నారు. సామర్థ్యంలో మార్పు ఉంది. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఈ ఇంజక్షన్ వాడతారు.
పురుషుల్లో 64 శాతం.. మహిళల్లో 36 శాతం
2014–15 నుంచి 2025–26 వరకు 12 ఆర్థిక సంవత్సరాల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఏటా సగటున 13,842 పక్షవాతం (stroke) కేసులకు వైద్యం అందింది. 2024–25లో 18,133, 2025–26లో 16,670 కేసులు నమోదయ్యాయి. ఈ 12 ఏళ్ల లో మహిళలకు 59,312 కేసుల్లో, పురుషులకు 1,06,791 కేసుల్లో చికిత్స అందించారు. మొత్తం కేసుల్లో మహిళల వాటా 35.7 శాతం, పురుషుల వాటా 64.3 శాతంగా ఉంది. ప్రతి 100 కేసుల్లో సగటున 36 మంది మహిళలు, 64 మంది పురుషులు ఉన్నారు. ఏటా సగటున 4,943 మంది మహిళలు, 8,899 మంది పురుషులు ఈ పథకం కింద వైద్యసేవలు పొందారు. 2014–15లో మహిళలకు 3,183 కేసుల్లో, పురుషులకు 5,669 కేసుల్లో చికిత్స అందించారు. 2025–26 నాటికి మహిళల కేసులు 5,694కు, పురుషుల కేసులు 10,976కు చేరాయి. ఈ కాలంలో మహిళల కేసుల సంఖ్య 78.9 శాతం, పురుషుల కేసుల సంఖ్య 93.6 శాతం పెరిగింది. 2025–26లో మొత్తం కేసుల్లో మహిళల వాటా 34 శాతం కాగా, పురుషుల వాటా 66 శాతంగా నమోదైంది. 2026–27లో అక్టోబరు వరకు నమోదైన 8,538 కేసుల్లో మహిళలు 2,857 మంది (33 శాతం), పురుషులు 5,681 మంది (67 శాతం) ఉన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో అక్టోబరు వరకు పక్షవాతం చికిత్స కోసం రూ.22,86,34,579 వ్యయమైనట్లు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు తెలిపిoది.
