తుపాను సమయంలోనూ వైద్య ఆరోగ్య శాఖ నిరంతర సేవలు

-3,100 మంది గర్భిణులను ఆసుపత్రులకు తరలింపు
-367 ప్రసవాల నమోదు
-64 ఆసుపత్రుల భవనాలు, ఇతర నిర్మాణాలకు నష్టం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
తుపాను సమయంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ప్రసవ సమయం దగ్గరపడిన, అధిక ప్రమాద గర్భిణులను గుర్తించి ఆసుపత్రులకు తరలించడంతోపాటు అంబులెన్సులు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు, సంచార వైద్య వాహనాలను అందుబాటులో ఉంచింది. తుపాను కారణంగా 64 ఆసుపత్రులకు నష్టం జరిగినoది.

గర్భిణులకు ముందస్తు వైద్య సాయం

ప్రసవానికి రెండు వారాల్లోపు గడువు ఉన్న, అధిక ప్రమాద గర్భిణులు కలిపి 4,228 మందిని గుర్తించి, 3,100 మందిని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 690 మందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 83 మందిని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, 430 మందిని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, 442 మందిని ప్రాంతీయ ఆసుపత్రులకు, 132 మందిని జిల్లా ఆసుపత్రులకు, 456 మందిని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రులకు, 762 మందిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో 367 మందికి ప్రసవాలు జరిగాయి

అత్యవసర వైద్య సేవలు

తుపాను సమయంలో 485 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. వీటి ద్వారా 43 మందిని ఆసుపత్రులకు తరలించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవల కింద 196 వాహనాలను అందుబాటులో ఉంచగా, వీటి ద్వారా 15 మందిని ఆసుపత్రులకు తరలించారు. అలాగే 549 సంచార వైద్య వాహనాలను సిద్ధంగా ఉంచి, 50 వైద్య శిబిరాలు నిర్వహించారు.

ఆసుపత్రులకు జరిగిన నష్టం

తుపాను కారణంగా పలు ఆసుపత్రుల్లో భవనాలు, పైకప్పులు, విద్యుత్తు పరికరాలు, జనరేటర్లు, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కైకలూరు, బారువ, టెక్కలి, అగనంపూడి, పెందుర్తి, నక్కపల్లి, నర్సీపట్నం, రేపల్లె, అమలాపురం, రంపచోడవరం, ముమ్మిడివరం, అల్లవరం, కొత్తపేట, నెల్లిమర్ల ఆసుపత్రుల్లో నష్టం నమోదైంది. పెనుమంట్ర, దేవపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రహరీ గోడలు దెబ్బతిన్నాయి. ఏలూరు, గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విద్యుత్తు తీగలు, జనరేటర్లు, ఇతర పరికరాలు, మౌలిక సదుపాయాలకు నష్టం జరిగింది. విశాఖపట్నంలోని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో ఆపరేషన్‌ గదుల పైకప్పుల నుంచి నీరు కారడం, పాత భవనంలోని పలు ప్రాంతాల్లో నీరు లీకవడం, కిటికీలు, తలుపులు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తాయి.