తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రతి ఒక్కరూ ధ్యానం, యోగా, ఆరోగ్యకరమైన జీవన విధానాలను అలవర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డా. మాకల సత్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా పిరమిడ్ సాధన ధ్యాన ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానవ జీవితంలో ప్రాణశక్తికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ధ్యానం ద్వారా మనిషి తన అంతరంగాన్ని తెలుసుకుని జీవిత లక్ష్యాన్ని గుర్తించగలడని వివరించారు. ప్రతి ఒక్కరూ తమకు అప్పగించబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ధ్యానం ఆత్మపరిశీలనకు మార్గం చూపుతుందని అన్నారు. మనిషి ఆరోగ్య పరిరక్షణలో యోగా, ఆయుర్వేదం, సిద్ధ వైద్య విధానాలకు విశిష్ట స్థానం ఉందని పేర్కొన్నారు. ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ వంటి పద్ధతులపై కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ప్రాచీన భారతీయ ఆరోగ్య విధానాలు పంచభూత సిద్ధాంతాల ఆధారంగా రూపొందాయని, వాటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తెలిపారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మనిషి సంపూర్ణ వికాసానికి దోహదపడే సమగ్ర సాధన అని వివరించారు. అనంతరం డా. మాకల సత్యనారాయణను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, యోగా నిపుణులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు. నిర్వాహకులు పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ధ్యానం, యోగా ద్వారా ప్రాణశక్తిని పెంపొందించుకోవాలి… : డా. మాకల సత్యనారాయణ
