స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

-క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు నాగలక్ష్మి.ఎస్, ఐఏఎస్
-సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశం
-నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా తప్పనిసరి

నందిగామ/ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త:
మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు నాగలక్ష్మి.ఎస్, ఐఏఎస్ ఆదేశించారు.

తిరువూరు, కంచికచర్ల, వీరులపాడు, నందిగామ తదితర ప్రాంతాల్లో గురువారం జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు నాగలక్ష్మి.ఎస్, విస్తృతంగా పర్యటించి, క్షేత్రస్థాయిలో ఎన్నికల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాలు, సీసీటీవీల పనితీరు, మౌలిక వసతులు, సిబ్బంది నియామక వివరాలను సమీక్షించారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అదనపు పోలీస్ బలగాలను మోహరించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, పోలింగ్ బూత్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతంగా సీసీ కెమెరాలతో పాటు వీడియో చిత్రీకరణ ఏర్పాట్లు చేయాలన్నారు. సాంకేతిక పరికరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి ఎన్నికల నిబంధనలు, సమస్యల పరిష్కారంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. బాధ్యతల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. అర్హులైన ప్రతి ఓటరు ఎటువంటి భయాందోళనలు లేకుండా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం పెంపొందించేలా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ పరిశీలనా పర్యటనలో స్థానిక రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ మరియు ఎన్నికల విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.