సరస్ మేళాలో సాంస్కృతిక సందడి..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
జాతీయ సరస్ మేళా ప్రాంగణంలో సాయంత్రం వేళ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు తమలోని ప్రతిభను చాటుకుంటూ ప్రదర్శించిన నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి ఈ ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి, తమ ప్రతిభతో ఆకట్టుకున్న చిన్నారులను అభినందించి ప్రోత్సహించారు. ఇలాంటి వేదికలు చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. సంప్రదాయ కళలు, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. సరస్ మేళా కొనుగోళ్లు, గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శనలకే పరిమితం కాకుండా, కళలు, సంస్కృతి, ప్రతిభకు వేదికగా నిలుస్తూ సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తోంది.