ఒక్కో ల‌ఖ్‌ప‌తి దీదీ వెనుక ఒక్కో విజ‌య‌గాథ‌

– ఎస్‌హెచ్‌జీల శ‌క్తిని చాటుతున్న మ‌హిళామ‌ణులు
– విజయవాడలో వైభవంగా జాతీయ సరస్ మేళా
– గత 10 రోజుల్లోనే రూ. 6 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు
– ప్ర‌తిఒక్క‌రూ మేళాను సంద‌ర్శించండి.. చేనేత‌, హ‌స్త‌క‌ళ‌ల‌ను ప్రోత్స‌హించండి
– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, స‌ర‌స్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు క‌టారియా, సుధీర్‌కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా గత పది రోజులుగా అత్యంత విజయవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. మేళాలో పాల్గొన్న ప్ర‌తి ల‌ఖ్‌ప‌తిదీదీ వెనుక ఒక్కో విజ‌య‌గాథ ఉంద‌ని పేర్కొన్నారు.
గురువారం పున్న‌మిఘాట్ వ‌ద్ద జాతీయ సరస్ మేళా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సాధారణంగా దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగే జాతీయస్థాయి సరస్ మేళాను.. కేంద్రం, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తొలిసారిగా ఢిల్లీ వెలుపల విజయవాడలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించిన నాటి నుంచి మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని వెల్లడించారు. ​కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 600 స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల స్టాళ్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. గత 10 రోజుల్లోనే రూ. 6 కోట్ల‌కుపైగా వ్యాపార లావాదేవీలు నమోదయ్యాయని, ఇది ఢిల్లీ స్థాయి అమ్మకాలతో సమానమని చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ‘ఇండియా ఫుడ్ కోర్ట్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, దేశంలోని విభిన్న సంప్రదాయ వంటకాలను ప్రజలకు రుచి చూపిస్తూ మహిళా సంఘాలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాయని ప్రశంసించారు. ​సరస్ మేళా కేవలం వస్తువుల విక్రయాలకే పరిమితం కాకుండా మహిళా పారిశ్రామికవేత్తల ఆలోచనల‌ను ప‌ర‌స్ప‌రం పంచుకునేందుకు, నెట్‌వర్కింగ్‌కు, గ్లోబల్ బ్రాండింగ్‌కు ఒక గొప్ప వేదికగా నిలిచిందని వివరించారు. ప్రతిరోజూ బయ్యర్స్, వివిధ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ ఉత్పత్తుల బల్క్ ఆర్డర్లు, ప్రమోషన్లకు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల చేనేత, హస్తకళల నాణ్యమైన ఉత్పత్తులు సరసమైన ధరలకే ఒకేచోట లభిస్తున్నాయని, కుటుంబ సమేతంగా అందరూ సరస్ మేళాను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు.
ఎన్ఐఆర్‌డీ – స‌ర‌స్ మేళా స‌మ‌న్వ‌య‌క‌ర్త క‌టారియా మాట్లాడుతూ విజయవాడలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ సెర్ప్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 13 నుండి 31 వరకు జాతీయ సరస్ మేళాను నిర్వహిస్తున్నారన్నారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధి వెలుపల ఈ స్థాయి జాతీయ సరస్ మేళాను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారన్నారు. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా దాదాపు 1,500 మందికి పైగా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారన్నారు. సందర్శకుల కోసం వివిధ రాష్ట్రాల సంప్రదాయ వంటకాలతో 50 ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశామ‌న్నారు. స‌ర‌స్ మేళాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని క్రింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు.
స‌ర‌స్ మేళా కోఆర్డినేట‌ర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ సందర్శకులు, చేతివృత్తుల వారికి స‌హాయ‌ప‌డేందుకు వెల్‌కమ్ పెవిలియన్, వివిధ ప్రభుత్వ శాఖల పథకాలను వివరించేందుకు కన్వర్జెన్స్ పెవిలియన్, మహిళలకు బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు మీట్ అండ్ గ్రీట్ పెవిలియన్, వస్తువుల తయారీని ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు డెమో పెవిలియన్లను నెలకొల్పామన్నారు. వీటితో పాటు హెల్త్ డెస్క్, మదర్ కేర్ రూమ్, పిల్లల ఆటల కోసం ప్రత్యేక జోన్ వంటి అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు. కాబట్టి విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వివిధ ప్రాంతాల ప్ర‌జ‌లు ఈ మేళాను సందర్శించి మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఆయన కోరారు.
స‌మావేశంలో అస్సాంకు చెందిన ల‌ఖ్‌ప‌తిదీదీ బ‌ర్నాలి పాఠ‌క్ త‌మ చేనేత వ‌స్త్రాలు, తెలంగాణ‌కు చెందిన ల‌ఖ్‌ప‌తిదీదీ రాధిక త‌మ హ‌స్త‌క‌ళాభ‌ర‌ణాల‌కు స‌ర‌స్ మేళా గొప్ప వేదిక‌గా నిలుస్తోంద‌ని.. విజ‌య‌వాడ, ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌లు త‌మ‌ను ఎంతో ఆద‌రిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇంత మంచి అవ‌కాశం క‌ల్పిస్తున్న ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మీడియా స‌మావేశం అనంత‌రం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను వీక్షించి, క‌ళాకారుల‌ను అభినందించారు.