-హెల్త్ కార్డుల ద్వారా సంపూర్ణ వైద్య సేవలు అందించేందుకు కృషి
-అదనపు పెన్షన్‌తో 4 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం
-కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికీ హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
-ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఏ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్నో దశాబ్దాల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్జీజివో సంఘం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కృషి చేస్తోందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ ఏ. విద్యాసాగర్ తెలిపారు. పెన్షనర్ల వయస్సు, ఆరోగ్య అవసరాలు, ఆర్థిక, సాంకేతిక సమస్యలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
స్థానిక గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ, పెన్షనర్లకు హెల్త్ కార్డుల ద్వారా పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
హెల్త్ కార్డుల ద్వారా అందించే వైద్య సేవలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నేరుగా ట్రస్ట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నామని, తద్వారా ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపులు వేగవంతమై, ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని వివరించారు.
నగదు రహిత వైద్య సేవల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సుమారు నాలుగు లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు చేయడం ద్వారా నాలుగు లక్షల మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నిటిని ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దాదాపు 25 వేల కోట్లకు పైగా పాత బకాయిలను తీర్చడంలో ఏపీఎన్జీవో సంఘం కీలక పాత్ర పోషించిందని తెలిపారు.
పెన్షనర్లు కూడా ఉద్యోగ సంఘంలో భాగస్వాములే!
ఎన్జీవో సంఘ సభ్యులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, పదవీ విరమణ అనంతరం పెన్షనర్లుగా మారిన వారే నేటి విశ్రాంత ఉద్యోగులని విద్యాసాగర్ గుర్తుచేశారు. అందువల్ల పెన్షనర్ల సమస్యలను సంఘం తన సమస్యలుగానే భావిస్తుందని, వారి సంక్షేమం, హక్కులు, పదవీ విరమణ ప్రయోజనాల సాధనకు ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.
అలాగే, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు మంజూరు చేసి నగదు రహిత వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి జె. రాజారావు, ఎన్జీవో నాయకులు సత్యనారాయణ రెడ్డి, శ్రీ సీవీఆర్ ప్రసాద్, నజీర్, దాస్, పెన్షనర్ల సంఘ నాయకులు కె .డాలి నాయుడు, జి. నారాయణరావు, విష్ణువర్ధన్, విశ్రాంత డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు వెంకటేశ్వరరావు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
