గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 1వ తేదీన జరగనున్న పోలింగ్‌కు సంబంధించి ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు బిఎల్ఓలు వార్డుల వారీగా ఓటర్ స్లిప్పుల పంపిణీని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వేచ్ఛాయుత మరియు పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడంలో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ అత్యంత కీలకమైనదని తెలిపారు. నగరంలో 596 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరు స్లిప్పుల పంపిణీ కోసం 596 మంది సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ప్రతి సిబ్బందికి సుమారు 1,000 నుండి 1,200 ఓటరు స్లిప్పులను కేటాయించడం జరిగిందన్నారు. నగరంలోని ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, నిర్లక్ష్యానికి తావులేకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పక్కాగా జరిగేలా వార్డుల వారీగా ప్రత్యేక అధికారులు, బిఎల్ఓ సూపర్వైజర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఓటరు స్లిప్ అందించిన అనంతరం, రశీదుపై సదరు కుటుంబంలోని ఒకరి సంతకం లేదా వేలిముద్ర తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో మరణించినవారు, నివాసం మారినవారు, లేదా అందుబాటులో లేనివారి వివరాలను కూడా పక్కాగా రికార్డు చేసి, సంబందిత జాబితాను రిటర్నింగ్ ఆఫీసర్ కు తప్పనిసరిగా సమర్పించాలని స్పష్టం చేశారు.
అలాగే, ఓటర్లు తమ వార్డు, పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితాలోని వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ https://sec-ems.ap.gov.in ను సందర్శించి చూసుకోవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా మరియు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి..అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, కమిషనర్..మయూర్ అశోక్
