-250 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా ఆయుర్వేద మందుల పంపిణీ
ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (RARI), విజయవాడ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని నాగెళ్ల రాజేశ్వరమ్మ–జానకిరామయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 250 మంది రోగులు వైద్య సేవలు పొందారు.
సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ సి. మురళీకృష్ణ మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని భగవాన్ శ్రీ ధన్వంతరి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిశోధన అధికారులు డాక్టర్ సవిత పి. గోపోడ్, డాక్టర్ నిశాంత్ కె. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలు అందించారు.
సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ డాక్టర్ సాయి సుమన, డాక్టర్ టి. జ్ఞానేందర్ రెడ్డి, డాక్టర్ సాయి గౌతమి, డాక్టర్ సాయి రామిరెడ్డి, డాక్టర్ జ్యోత్స్నతో పాటు ఫార్మసిస్టులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
రోగులకు ఆయుర్వేద వైద్య విధానం, వ్యాధుల నివారణ, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన ఆయుర్వేద ఔషధాలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ శిబిరాన్ని ఆర్. రామచంద్రరావు, నాగెళ్ల రాజేశ్వరమ్మ–జానకిరామయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఆయుర్వేదంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
