

-బీసీ సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ కీలక నిర్ణయం..
-ఎంపీ, ఎమ్మెల్యేలు సమిష్టి నిర్ణయం తో నియామకాలు ఖరారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన పైడి తులసి ఎంపికయ్యారు. కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు వీరి నియామకాలు ఖరారయ్యాయి.ఈ నియామకాల్లో బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించడం విశేషం. ఫ్లోర్ లీడర్‌గా ఎంపికైన ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) సగర సామాజిక వర్గానికి చెందినవారు కాగా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఎంపికైన పైడి తులసి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. విజయవాడ నగరపాలక సంస్థలో కీలకమైన ఈ రెండు బాధ్యతలను బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు అప్పగించడం సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన పట్ల పార్టీకి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత, నాయకత్వ అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఒక మంచి పరిణామంగా నిలుస్తుంది.
ఈ ఎంపికకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న సమిష్టిగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. నగర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సామాజిక సమతుల్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), పైడి తులసి పేర్లను కేంద్ర పార్టీ కార్యాలయానికి సిఫార్సు చేశారు.ముఖ్యంగా స్థానిక నాయకత్వం సమిష్టిగా చేసిన సిఫార్సులకు కేంద్ర పార్టీ కార్యాలయం ఆమోదం తెలపడంతో ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులకు సంబంధించిన నియామకాలు అధికారికంగా ఖరారయ్యాయి.నూతనంగా ఎంపికైన ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), పైడి తులసి నగరపాలక సంస్థలో ప్రజా సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, నగర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ, కూటమి పార్టీల సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఒక మంచి పరిణామంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
