-బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, సమానత్వ సాధనకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రముఖ సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) గారు నేడు విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి చేసిన విశేష సేవలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశ సామాజిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత సంఘ సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మూఢనమ్మకాలపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారని పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక దార్శనికుడని అన్నారు.ముఖ్యంగా మహిళా విద్యకు ప్రాధాన్యతనిస్తూ, బాలికలకు విద్యను అందించేందుకు తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో నిజమైన మార్పు సాధ్యమని విశ్వసించి, అణగారిన వర్గాలకు విద్యావకాశాలు కల్పించేందుకు ఆయన చేసిన కృషి నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, మానవ హక్కుల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే సాగించిన ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ చిన్ని పిలుపునిచ్చారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయడమే మనం అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, మాజీ కార్పొరేటర్ దేవినేని అపర్ణ , టీడీపీ సీనియర్ నాయకులు సోలంకి రాజు, మాదిగాని గురునాథం, అబీద్ తదితరులు పాల్గొన్నారు.
