– ఈ నెల 29న నందిగామ డివిజన్‌లో ఏడు మండలాల్లో పోలింగ్
– ఏకగ్రీవాలు మినహా 127 సర్పంచ్ స్థానాలు, 1,203 వార్డులకు ఎన్నికలు
– నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
– ఎన్నికల నిర్వహణకు 4,000 మంది అధికారులు, సిబ్బంది
– వెయ్యి మందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు
– సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకం, వెబ్‌క్యాస్టింగ్
– డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేయడం జరిగిందని.. ఇదే విధంగా రెండో దశ ఎన్నికలను కూడా నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 29వ తేదీన రెండోదశ ఎన్నికల్లో 127 సర్పంచ్ స్థానాలు, 1,203 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ శనివారం కంచికచెర్ల మార్కెట్‌యార్డు, నందిగామ జెడ్‌పీ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. రెండోదశలో నందిగామ డివిజన్ పరిధిలో కంచికచెర్ల మండలంలో 16 గ్రామ పంచాయతీలు, 178 వార్డులకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా నందిగామ మండలంలో 23 గ్రామపంచాయతీలు, 228 వార్డులకు, చందర్లపాడు మండలంలో 18 పంచాయతీలు, 194 వార్డులు, పెనుగంచిప్రోలు మండలంలో 15 పంచాయతీలు, 162 వార్డులు, వత్సవాయి మండలంలో 25 గ్రామ పంచాయతీలు, 246 వార్డులు, జగ్గయ్యపేట మండలంలో 19 గ్రామ పంచాయతీలు, 212 వార్డులు, వీరుళ్లపాడు మండలంలో 22 గ్రామ పంచాయతీలు, 212 వార్డుల ఎన్నికలకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే 11 సర్పంచ్ స్థానాలకు, 229 వార్డు స్థానాలు ఏకగ్రీవమైన నేపథ్యంలో వీటికి మినహా మిగిలిన వాటికి పోలింగ్ జరుగుతుంది.
1,468 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు:
రెండోదశ ఎన్నికలకు 1,468 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశామని, ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుందని.. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఆపై ఫలితాల వెల్లడి ఉంటుందని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. అవసరం మేరకు కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. రెండోదశఎన్నికల నిర్వహణకు సుమారు 4,000 మంది అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల విధులకు నియమితులైన సిబ్బంది తమ బాధ్యతలను సమర్థవంతంగా ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో వెయ్యిమందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రతా చర్యలు ఉంటాయని, పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చూస్తున్నామని, సున్నిత, అత్యంత సున్నిత కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించడంతో పాటు వెబ్‌క్యాస్టింగ్‌కు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో నిరంతర నిఘా, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కౌంటింగ్‌కు ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేశామని వివరించారు. అభ్యర్థులు కూడా ఎన్నికల నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలని కోరారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఘటనలను ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతీరాజ్, రెవెన్యూ, పోలీసు తదితర సమన్వయ శాఖల అధికారులు పటిష్ట సమన్వయంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఎన్నికలకు సంబంధించి సమాచారం లేదా ఫిర్యాదులకు కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం (91549 70454) అందుబాటులో ఉందని, ఈ నంబరులో సంప్రదించవచ్చని సూచించారు. ఓటర్లు తమ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీపీవో టి.సీతామహాలక్ష్మి, నందిగామ ఆర్‌డీవో జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
