పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం నగర పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, పున్నమిఘాట్, భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ, రహదారుల పరిస్థితి తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ నగరాన్ని గుంతలు లేని నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇంజినీరింగ్ అధికారులు రహదారులపై ఉన్న గుంతలను గుర్తించి, ఎప్పటికప్పుడు ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పనుల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

అనంతరం విద్యాధరపురంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించారు. నగరంలోని అన్ని అన్న క్యాంటీన్లకు కేటాయించిన నోడల్ అధికారులు ప్రతిరోజూ తమకు కేటాయించిన క్యాంటీన్లను తప్పనిసరిగా సందర్శించి, అక్కడి నిర్వహణ, పారిశుధ్యం, ఆహార సరఫరా తదితర అంశాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్న క్యాంటీన్ల నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో అదనపు కమిషనర్లు ఎ. రవీంద్రరావు, కె. శకుంతల, చీఫ్ ఇంజినీర్ పి. సత్యకుమారి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గౌరీ, డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్, పర్యవేక్షణ ఇంజినీర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఆర్ ఎఫ్ ఓ రత్నబాబు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, బయాలజిస్ట్ సూర్యకుమార్ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.