పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి…

-గ్రామాభివృద్ధికి ఏకగ్రీవ ఎన్నికలు దోహదం.. రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నిధులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఆదివారం పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రానున్న పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై ముఖ్యమంత్రి చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయని, కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనకు ప్రజల నుంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజల నమ్మకాన్ని ఓట్ల రూపంలో పొందేలా నాయకులు కృషి చేయాలని సూచించారు.

పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు, పార్టీ గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికలు వేర్వేరని, గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ఆధారంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందని వివరించారు.

5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు.
5 వేల నుంచి 10 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు.
10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు.

గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కనీస ప్రోత్సాహకాన్ని రూ.15 లక్షలకు, గరిష్ఠంగా రూ.20 లక్షలుగా ఉన్న మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచిన విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు.

గ్రామాల్లో అందరి ఆమోదంతో ఏకగ్రీవాలు జరిగితే వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల విషయంలో గ్రామస్థాయి నాయకుల మధ్య పోటీ, వ్యక్తిగత పట్టింపులు, విభేదాలు తలెత్తకుండా చూడాలని, పార్టీలో ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.

ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని గ్రామాల నాయకులతో సంప్రదింపులు జరిపి ఏకగ్రీవాలపై అవగాహన కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. ఒకే పార్టీలోని నాయకులు వేర్వేరు వర్గాలుగా విడిపోయి పోటీ చేసే పరిస్థితి రాకుండా సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు.