విజయవాడ ట్రాఫిక్ సమాచారం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభం

-ప్రజల సౌకర్యార్థం డిజిటల్ వేదిక.. ఫిర్యాదుల స్థితిని తెలుసుకునే అవకాశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో ట్రాఫిక్ నిర్వహణను మరింత పారదర్శకంగా, సులభతరంగా మార్చేందుకు ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐపీఎస్ ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతో సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ వెబ్‌సైట్ ద్వారా నగరంలోని ట్రాఫిక్ అప్‌డేట్స్, రోడ్ల మూసివేతలు, దారి మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలు, రూట్ మ్యాప్‌లు, పార్కింగ్ ప్రదేశాల వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన వీడియోలను వీక్షించవచ్చు. తప్పుగా పార్కింగ్ చేసిన వాహనాలు, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే సమస్యలపై ఫొటోలు, లొకేషన్‌తో ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పించారు. ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్ నంబర్ ద్వారా దాని స్థితిని తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రయాణానికి ముందే ప్రజలు వెబ్‌సైట్ ద్వారా ట్రాఫిక్ సమాచారాన్ని తెలుసుకొని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
ప్రజలు https://ntr-police-traffic-updates.pages.dev లింక్ ద్వారా లేదా పోలీస్ శాఖ విడుదల చేసిన పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం, అడ్మిన్ డీసీపీ కే.జి.వి. సరిత, ట్రాఫిక్ ఏసీపీ డి. పావన్ కుమార్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ ఎం.వి. దుర్గారావు, కమాండ్ కంట్రోల్, ఖాకీ స్టూడియో సిబ్బంది పాల్గొన్నారు.