-రేపటి నుంచి అల్లూరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదు రోజుల పాటు పర్యటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద అమలవుతున్న పలు పథకాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రెండు బృందాలు శనివారం విజయవాడకు చేరుకున్నాయి. ఆదివారం (ఈ నెల 22) నుంచి 26వ తేదీ వరకు ఐదు రోజుల పాటు అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించి వైద్య సేవల అమలుతీరును క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబుతో కేంద్ర బృందాల ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్హెచ్ఎం పథకాలు, వాటి పురోగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్హెచ్ఎం పథకాల అమలులో భాగంగా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, వైద్య సేవల విస్తరణ, పర్యవేక్షణ, సిబ్బంది నియామకాలు తదితర అంశాలను కేంద్ర బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాయని తెలిపారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ప్లాన్ (పీఐపీ) ద్వారా బడ్జెట్ కేటాయింపులు జరుగుతాయని వివరించారు.
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంజీవని ప్రాజెక్టును ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అమలు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు చక్రధర్‌బాబు తెలిపారు. డిసెంబరు 10న రాష్ట్రవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా పరీక్షలు(ట్రయల్ రన్) నిర్వహించి, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 28 జిల్లాల్లో ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ సంజీవని ప్రాజెక్టు అమలుపై నిరంతరం సమీక్షిస్తూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారని చెప్పారు.
అలాగే దేశంలోనే ముందంజలో ఉన్న ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ (ఏబీహెచ్ఏ) రికార్డుల సృష్టి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు ద్వారా ఉద్యోగులు, జర్నలిస్టులు, సామాన్య ప్రజలకు అమలు చేస్తున్న ఉచిత ఆరోగ్య బీమా పథకం, మాతా శిశు సంరక్షణ, ఇమ్యునైజేషన్, న్యూట్రిషన్, ఎన్సీడీ సర్వే, క్యాన్సర్ నివారణా చర్యలు, క్రిటికల్ కేర్, ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు-అమలు చేస్తున్న ఉత్తమ విధానాలు తదితర అంశాల గురించి కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో మాతృ మరణాలను గణనీయంగా తగ్గించామని, బాలికలు, గర్భిణిలలో రక్తహీనత నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో 4.52 లక్షల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను వేసి లక్ష్యాన్ని అధిగమించామన్నారు.
ఈ సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రామస్థాయి నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు పరిశీలన
ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు కేంద్ర బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటిస్తాయి. గ్రామస్థాయిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ప్రాంతీయ ఆసుపత్రులు (ఏహెచ్‌లు), జిల్లా ఆసుపత్రుల (డీహెచ్‌లు) వరకు ఎన్హెచ్ఎం పథకాల అమలుతీరును పరిశీలిస్తాయి. గ్రామస్థాయిలో మహిళలతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకుంటాయి. పర్యటన అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లను మర్యాదపూర్వకంగా కలుస్తాయి.
రెండు కేంద్ర బృందాలకు వేర్వేరు జిల్లాల బాధ్యతలు
మొదటి కేంద్ర బృందానికి మోనా గుప్తా నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా డాక్టర్ స్మితా శ్రీవాత్సవ్, మతుసి డిబ్నాథ్, డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ పి.జె. శ్రీనివాస్, కుమార్ మనీష్, డాక్టర్ యు.ఆర్. శేఖర్ నంబూరి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు.
రెండో కేంద్ర బృందానికి డాక్టర్ అవినాష్ సంత్లియా నాయకత్వం వహిస్తారు. సభ్యులుగా డాక్టర్ సిద్ధార్థ మౌర్య, డాక్టర్ సపవత్ శంకర్, డాక్టర్ శ్రీరామ్ వి. గోసవి, డాక్టర్ శత్రుఘ్నన్ ఠాకూర్, దీపక్ కుమార్, రమణ ఎడ్ల, డాక్టర్ మహిమా సింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తారు. ఎన్హెచ్ఎం రాష్ట్ర విభాగం అధికారులు ఈ బృందాలకు సహకరిస్తారు.
