-ఎన్నికల వ్యయంపై పటిష్టమైన పర్యవేక్షణతో పారదర్శక ఎన్నికలు నిర్వహించాలి
-అభ్యర్థుల ఖర్చుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి
-వ్యయ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి
-ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ శనివారం రెడ్డిగూడెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యయ నిర్వహణ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సబ్ ఇన్స్పెక్టర్, ఎన్నికల వ్యయ బృందం సభ్యులతో సమావేశమై, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నికల వ్యయ పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై సమర్థవంతమైన పర్యవేక్షణ అత్యంత కీలకమని ఎన్నికల వ్యయ పరిశీలకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా షాడో రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు సమర్పించే ఖర్చుల వివరాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్న వ్యయంతో సరిపోల్చేందుకు ఈ రిజిస్టర్లు ఉపయోగపడతాయని తెలిపారు. అభ్యర్థులు రోజువారీ ఎన్నికల వ్యయ వివరాలను నిర్ణీత సమయంలో అకౌంటింగ్ బృందానికి సమర్పించాలని సూచించారు. ఖర్చుల వివరాలను సమర్పించని అభ్యర్థులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ర్యాలీలు, సభలు, లౌడ్స్పీకర్ల వినియోగానికి సంబంధించి జారీ చేసే అనుమతుల ప్రతులను నిఘా, పర్యవేక్షణ నిమిత్తం అకౌంటింగ్ బృందం వద్ద ఉంచాలని తెలిపారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాల్లో సక్రమంగా నమోదు చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.
ఎస్ఎస్టీ చెక్పోస్టును తనిఖీ చేసిన పరిశీలకులు
రంగాపురం వద్ద రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ చెక్పోస్టును ఎన్నికల వ్యయ పరిశీలకులు తనిఖీ చేశారు. రెడ్డిగూడెం మండలంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తున్న బృందం, తనిఖీల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ఉప ఎంపీడీఓ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహన వివరాలతో సహా ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రోజువారీ నివేదికలను రెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలోని అకౌంటింగ్ బృందానికి సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ మార్గదర్శకాలను అధికారులు, సంబంధిత బృందాలు కచ్చితంగా పాటించాలని, ఎటువంటి లోపాలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు స్పష్టం చేశారు.
