స్థానిక ఎన్నికల్లో కూటమికి ప్రజల మద్దతు

-ప్రజాతీర్పు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచింది: డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని డా. పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. తిరుపతిలో కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024లో ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో కూటమికి ప్రజలు పట్టం కట్టారని, ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అదే ఆదరణ చూపించారని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లాలో మొత్తం 35 జెడ్పీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ ఆరు స్థానాలకే పరిమితం కావడం, మిగిలిన స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యత సాధించడం ప్రజాతీర్పును తెలియజేస్తోందన్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమికి ప్రజల మద్దతు లభించిందని తెలిపారు. సామాజిక న్యాయం, అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అందించిన మద్దతును బాధ్యతగా స్వీకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రి పనబాక లక్ష్మి, తుడా చైర్మన్ దాలస్ దివాకర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, మన్నూరు సుగుణమ్మ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.