హోటళ్లు, చికెన్ సెంటర్లపై నగరవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

-9 హోటళ్లు, ఒక చికెన్ సెంటర్‌కు నోటీసులు – రూ.28 వేల జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరంలో ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చికెన్ షాపులపై విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇన్చార్జ్ కమిషనర్ ఏ. రవీంద్రరావు ఆదేశాల మేరకు, ప్రజారోగ్య శాఖ ముఖ్య వైద్యాధికారిణి డా. నిర్మల గౌరి సూచనలతో సహాయ వైద్యాధికారులు డా. గోపాల్ నాయక్, డా. అన్నపూర్ణ ఆధ్వర్యంలో సర్కిల్-1, సర్కిల్-3 పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు.

సర్కిల్-3 పరిధిలోని 4వ, 10వ డివిజన్లతో పాటు సర్కిల్-1 పరిధిలోని ఆరు డివిజన్లలో శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర సిబ్బంది బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చికెన్ షాపుల్లో ఆహార పదార్థాల నాణ్యత, వంటశాలల పరిశుభ్రత, పరిసరాల శుభ్రత, వ్యర్థాల నిర్వహణ, తాగునీటి నాణ్యత, ట్రేడ్ లైసెన్సుల తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

సర్కిల్-3 పరిధిలోని 4వ డివిజన్‌లో తిరుమల టిఫిన్ సెంటర్, లక్ష్మీసాయి ఫాస్ట్ ఫుడ్స్, కుమారి ఫాస్ట్ ఫుడ్ సెంటర్, తిరుమల చికెన్ సెంటర్లను తనిఖీ చేయగా, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మూడు హోటళ్లు, ఒక చికెన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేసి రూ.8,000 జరిమానా విధించారు. అదేవిధంగా 10వ డివిజన్‌లో హైస్కూల్ రోడ్డులోని ఖాసీం భాయ్ రాయల్ బిర్యానీ, మణికంఠ టిఫిన్ అండ్ టీ సెంటర్, ఆల్ఫా అరేబియన్ మండి హౌస్‌లలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని మూడు హోటళ్లకు నోటీసులు జారీ చేసి రూ.12,000 జరిమానా విధించారు.

సర్కిల్-1 పరిధిలోని ఆరు డివిజన్లలో న్యూ పాండు టిఫిన్ సెంటర్, లక్ష్మీ టిఫిన్ సెంటర్, ప్రసాద్ టిఫిన్, కేసరాల రెస్టారెంట్, ఆర్.ఆర్. దర్బార్‌లను తనిఖీ చేయగా, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మూడు హోటళ్లకు నోటీసులు జారీ చేసి రూ.8,000 జరిమానా విధించారు.

మొత్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన తొమ్మిది హోటళ్లు, ఒక చికెన్ సెంటర్‌కు నోటీసులు జారీ చేసి రూ.28,000 జరిమానా విధించారు. గుర్తించిన లోపాలను నిర్దేశిత గడువులోగా సరిదిద్దుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత సంస్థలపై చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

నగర ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందుబాటులో ఉండేలా, ప్రజారోగ్యానికి విఘాతం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ నిరంతరం పర్యవేక్షణ చేపడుతోందని, ఇటువంటి తనిఖీలు రానున్న రోజుల్లో కూడా నగరవ్యాప్తంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.