విదేశీయుల ఓట్ల నమోదుకు బాధ్యత వహిస్తూ అమిత్ షా రాజీనామా చేయాలి: కె. రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దేశంలో కోట్లాది మంది విదేశీయులు అక్రమంగా ప్రవేశించి ఓటర్లుగా నమోదయ్యారనే ఆరోపణలు నిజమైతే, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపు, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారని పేర్కొన్నారు.

ఢిల్లీలో ఈ అంశంపై సమాధానం చెప్పకుండా అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చి, మూడు కోట్ల మంది విదేశీయులు, బంగ్లాదేశీయులు ఓటర్లుగా నమోదయ్యారని ఆరోపించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల ఓట్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తుంటే, మూడు కోట్ల మంది బంగ్లాదేశీయుల ఓట్లను కాపాడేందుకే ప్రతిపక్షాలు పోరాడుతున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. గత 12 ఏళ్లుగా ప్రధానిగా నరేంద్ర మోడీ, హోంమంత్రిగా అమిత్ షా అధికారంలో ఉన్నారని, కోట్లాది మంది విదేశీయులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఓటర్లుగా నమోదవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే కాదా అని నిలదీశారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీ కుమ్మక్కై ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరిపి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ సహకారంతో పథకం ప్రకారం ప్రతిపక్షాలకు చెందిన ఓట్లను తొలగించాయని రామకృష్ణ ఆరోపించారు. రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకే బీజేపీ ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నిజంగానే విదేశీయులు భారతదేశంలో ఓటర్లుగా నమోదై ఉంటే, దానికి నైతిక బాధ్యత వహించి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.